Politics

రాహుల్ యాత్రలో కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలి.

రాహుల్ యాత్రలో కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలి.

రాహుల్ యాత్రలో కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలి.
అలా సాధ్యం కాకపోతే.. భారత్ జోడో యాత్రను నిలిపేయండి.. కేంద్రం లేఖ

రాజస్థాన్ : చైనా సహా పలు దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటం లక్షల్లో కేసులు నమోదవుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది.కరోనా ప్రమాదం పొంచి ఉందని అలర్ట్ గా ఉండాలంటూ ఇప్పటికే రాష్ట్రాలకు లేఖలు రాసింది. దీంతోపాటు వరుస సమీక్షలు సైతం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో భారత్ జోడో యాత్రతో కరోనా ముప్పు పొంచి ఉందన్న ఆరోపణలతో కేంద్రం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు లేఖలు రాసింది. రాహుల్ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొనేవారంతా కచ్చితంగా కోవిడ్-19 మహమ్మారి మార్గదర్శకాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ యాత్రలో కోవిడ్ మార్గదర్శకాలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, ఒకవేళ ఈ నిబంధనలను పాటించడం సాధ్యం కాదనుకుంటే.. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని యాత్రను నిలిపేయాలంటూ స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్ కు లేఖలు రాసి.. కరోనా హెచ్చరికలు చేశారు. ఈ యాత్రలో పాల్గొనేవారంతా కచ్చితంగా మాస్క్‌లను ధరించాలని, శానిటైజర్లను ఉపయోగించాలని సూచించారు. కోవిడ్ టీకాలను తీసుకున్నవారు మాత్రమే పాల్గొనాలని డిసెంబర్ 20న రాసిన లేఖలో స్పష్టంచేశారు.

కాగా.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. రాహుల్ యాత్ర ప్రస్తుతం హర్యానాలోకి ప్రవేశించింది. బుధవారం ఉదయం భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌ నుంచి హర్యానాకు చేరుకుంది. మన్సుఖ్ మాండవీయ లేఖపై కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు చేసింది. ఇటీవల గుజరాత్‌ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ భారీ రోడ్‌ షోను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చింది. జోడో యాత్రతో రాహుల్‌ గాంధీకి సోషల్‌ మీడియాలో భారీ ఆదరణ లభిస్తోందని.. దీన్ని చూసి బీజేపీ భయపడుతోందని.. కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి ప్రశ్నించారు. తమ పార్టీకి ప్రజల నుంచి వస్తోన్న స్పందన చూసి కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. గుజరాత్‌లో ఓట్లు కోసం వెళ్లినప్పుడు ప్రధాని మోదీ మాస్క్‌ పెట్టుకున్నారా..? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు.

రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు ఎంపీలు పిపి చౌదరి, నిహాల్ చంద్, దేవ్‌జీ పటేల్ భారత్ జోడో పాల్గొంటున్న వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయంటూ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ యాత్రలో పాల్గొన్న తర్వాత హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కు కరోనావైరస్ పాజిటివ్ గా పరీక్షించారంటూ ఎంపీలు హైలైట్ చేశారు. ఎంపీల ఫిర్యాదుతో కేంద్ర ఆరోగ్య మంత్రి కాంగ్రెస్ నేతలకు లేఖ రాశారు.