Politics

‘సినిమావాళ్లను నమ్ముకుని రాజకీయం చేయటం కాపులకు అసాధ్యం’.

‘సినిమావాళ్లను నమ్ముకుని రాజకీయం చేయటం కాపులకు అసాధ్యం’.

తమిళనాడు రాష్ట్రప్రభుత్వ మాజీ సీఎస్‌ రామ్మోహన్‌రావు

సినిమావాళ్లనో, ఓ పరిశ్రమనో నమ్ముకుని రాజకీయం చేయటం కాపులకు అసాధ్యం. కులంలో నుంచి సమష్టి నాయకత్వం వచ్చినప్పుడే ఈ సామాజికవర్గం ముందుకెళ్తుంది’ అని తమిళనాడు రాష్ట్రప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి పాపిశెట్టి రామ్మోహన్‌రావు అన్నారు. కాపులు బీసీ రిజర్వేషన్‌ కోసం పోరాడొద్దని సూచించారు. గతంలో ముద్రగడ పద్మనాభానికీ ఈ విషయం తాను చెప్పానన్నారు. ఈ పోరాటం వల్ల బీసీలకు దూరమయ్యామని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వమూ కాపులకు బీసీ రిజర్వేషన్‌ ఇవ్వదని, అలా ఇస్తామని హామీ ఇచ్చినా అది ఒట్టిమాటేనని తెలిపారు.*

కాపులకు రిజర్వేషన్‌ ఇచ్చినా దానివల్ల ప్రయోజనం ఉండదన్నారు. ‘రాష్ట్రంలో కొన్నివర్గాలు 75 ఏళ్లుగా 20% రిజర్వేషన్లు పొందుతున్నాయి. వాటివల్లే అభివృద్ధి ఉంటే వారు ఈపాటికే ముఖ్యమంత్రులు అవ్వాలి కదా! ఎందుకు కాలేదు’ అని ప్రశ్నించారు. బీసీలు, ఇతర కులాలను కలుపుకొని వెళ్తేనే రాజ్యాధికారం సాధ్యపడుతుందని చెప్పారు. రాయల్‌ ఆంధ్రప్రదేశ్‌ కాపు ఉద్యోగుల సంక్షేమసంఘం వార్షిక క్యాలెండర్‌, డైరీ-2023 ఆవిష్కరణ కార్యక్రమం మంగళగిరిలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రామ్మోహన్‌రావు మాట్లాడారు. 4-5% జనాభా ఉన్న కులాలు రాజ్యమేలుతున్నాయనే తప్పుడు ఆలోచనల్లోకి కాపులు మళ్లిపోయారని, అది సరికాదని అన్నారు. తుని ఘటన వల్ల కాపు యువతపై అల్లరిమూకలనే ముద్ర పడిపోయిందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త తులసీ రామచంద్రప్రభు పాల్గొన్నారు.