Business

ఎయిరిండియా ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం కొరడా

ఎయిరిండియా ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం కొరడా

దేశ రాజధాని దిల్లీలోని వసంత్‌ విహార్‌లో ఉన్న అధికారిక భవనాల్లో ఇంకా నివాసం ఉంటున్న ఎయిరిండియా (Air India) ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని యాజమాన్య సంస్థ టాటా సన్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. అక్టోబరు నుంచి దీన్ని అమలు చేయాలని కోరినట్లు పలువురు ఉద్యోగులు తెలిపారు. నెలకు దాదాపు రూ.95,000 వరకు వసూలు చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ఇంత మొత్తం తీసేసిన తర్వాత చాలా మంది ఉద్యోగులకు చేతికందేదేమీ ఉండదని వాపోయారు.

ప్రస్తుతం ఎయిరిండియా ఉద్యోగులు నివాసం ఉంటున్న భవనాలు ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికల్లో భాగం కాదు. దీంతో ఈ ఆస్తుల్ని ఇతర రియల్‌ ఎస్టేట్‌ ప్రాపర్టీలతో పాటు ‘ఎయిరిండియా అసెట్‌ హెల్డింగ్స్‌ లిమిటెడ్‌’కు బదిలీ చేశారు. వీటిని రూ.60,000 కోట్ల రుణ బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం విక్రయించాల్సి ఉంది. ఎయిరిండియా టాటాల చేతుల్లోకి వెళ్లగానే ఉద్యోగులు వసంత్‌ విహార్‌లోని నివాసాల నుంచి ఖాళీ చేయాలని ప్రభుత్వం జులైలో ఆదేశాలు జారీ చేసింది. కానీ, వారు అప్పటి నుంచి గడువు పొడిగించాలని కోరుతూ వస్తున్నారు. ఇటీవల న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. వచ్చే ఏడాది పిల్లలకు బోర్డు పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఖాళీ చేయడానికి మరికొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎయిరిండియాకు ముంబయి, దిల్లీలో హౌసింగ్‌ కాలనీలు ఉన్నాయి. ఇప్పటికీ ఇక్కడ నివసిస్తున్న వారు వెంటనే ఖాళీ చేయాలని పలుసార్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లేదంటే రూ.10- 15 లక్షల వరకు జరిమానా విధిస్తామని కూడా బెదిరించినట్లు పలువురు ఉద్యోగులు ఆరోపించారు. అక్టోబరులో ఓసారి నీటి సరఫరా నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఇలా బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తున్నారని తెలిపారు.