NRI-NRT

టెక్సాస్ జ‌డ్జిగా భార‌త సంత‌తి మహిళ జూలీ ఎ. మాథ్యూ

టెక్సాస్ జ‌డ్జిగా భార‌త సంత‌తి మహిళ జూలీ ఎ. మాథ్యూ

భారతీయ-అమెరికన్ డెమొక్రాట్ జూలీ ఎ. మాథ్యూ టెక్సాస్‌లోని ఫోర్ట్ బెండ్ కౌంటీలో వరుసగా రెండవసారి న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. కేరళలోని తిరువల్లకు చెందిన మాథ్యూ, కాసరగోడ్‌లోని భీమనడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రమాణ స్వీకారం చేశారు. ఫోర్ట్ బెండ్ కౌంటీ కోర్టులో 3వ నంబర్‌కు అధ్యక్షుడిగా నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతారు. ఆమె తిరిగి ఎన్నికలకు పోటీ చేసి 123,116 ఓట్లతో రిపబ్లికన్ ఆండ్రూ డోర్న్‌బర్గ్‌ను ఓడించారు. తన ఈ ప్రయాణంలో మద్దతు తెలిపిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాథ్యూ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

మాథ్యూ 2018 ఎన్నికలలో రిపబ్లికన్ ట్రిసియా క్రెనెక్‌కు వ్యతిరేకంగా 8.24 శాతం తేడాతో గెలిచి, USలో బెంచ్‌కు ఎన్నికైన మొదటి భారతీయ-అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించింది. 15 ఏళ్లుగా ఆమె న్యాయ‌వృత్తిలో ఉన్నారు. టార్చర్, సివిల్ లిటిగేష‌న్‌, క్రిమిన‌ల్ మేట‌ర్స్ లాంటి అంశాల్లో ఆమె కేసుల వాదిస్తుంటారు. జువెనైల్ ఇంట‌ర్వెన్షన్, మెంట‌ల్ హెల్త్ కోర్టుకు అధిప‌తిగా ఆమె కొన‌సాగుతున్నారు. ఫిలడెల్ఫియాలో మాథ్యూ పెరిగింది. పెన్ స్టేట్ యూనివ‌ర్సిటీకి ఆమె హాజ‌రైంది. దెలావ‌ర్ లా స్కూల్ నుంచి ఆమె డాక్టరేట్ పొందారు.

ఆమె జనవరి 2021లో మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న యువకులకు సహాయం చేయడానికి జువెనైల్ ఇంటర్వెన్షన్ అండ్ మెంటల్ హెల్త్ కోర్ట్‌ను స్థాపించింది. ఫోర్ట్ బెండ్ కౌంటీలో 28.6 శాతం మంది విదేశీయులుండగా వారిలో 51 శాతం మంది ఆసియా-అమెరికన్లు ఉన్నారని మాథ్యూస్ పేర్కొన్నారు. వారిలో చాలామంది మలయాళీలు అధిక సంఖ్యలో ఉన్నారు.