Politics

ఆ అస్త్రమే చంద్రబాబు కు వరంగా మారింది.

ఆ అస్త్రమే చంద్రబాబు కు వరంగా మారింది.

ప్రభుత్వం తీసుకొచ్చిన అస్త్రాన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా మలచున్నారు. రోడ్లపైన సభలకు అనుమతి రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. దీని పైన అన్ని పార్టీలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసాయి. కుప్పంలో చంద్రబాబు అడుగు పెట్టే సమయంలో ఈ జోవో ను చూపిస్తూ పోలీసులు అడ్డుకున్నారు. రోడ్ షోలకు అనుమతి లేదని చెప్పారు. ఆ సమయంలో రాష్ట్రం మొత్తం తన వైపు చూసేలా తిప్పుకోవటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అదే సమయంలో కుప్పంలో పాదయాత్ర ద్వారా తన పర్యటన కొనసాగిస్తూ సానుభూతి సాధించే ప్రయత్నం చేస్తున్నారు. కుప్పంలో మద్దతు తగ్గిందని భావిస్తున్న వేళ..ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.జీవో జారీ – కుప్పంలో అడ్డుకున్న పోలీసులు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొన్న కందుకూరు..గుంటూరు సభల్లో తొక్కిసలాట జరిగింది. రెండు ప్రాంతాల్లోనూ కలిపి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికార వైసీపీ చంద్రబాబు లక్ష్యంగా ఆరోపణలు చేసింది. అదే సమయంలో రోడ్ల పైన సభలకు అవకాశం లేదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు ఇదే సమయంలో కుప్పం పర్యటనకు వచ్చారు. చంద్రబాబు రోడ్ షోలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే చంద్రబాబు పూర్తిగా పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకున్నారు. సమయం తీసుకున్నారు. రాష్ట్రం మొత్తం తన వైపు టర్న్ అయ్యేలా పావులు కదిపారు. మీడియాలో లైవ్ వస్తున్న సమయంలో ప్రభుత్వం పైన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం.. పోలీసుల తీరును ఎండగట్టారు. తనను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారనే అంశం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసారు. అదే సమయంలో పోలీసులు చెప్పినట్లుగా వెనక్కు వెళ్లలేదు. కుప్పంలో పర్యటన కొనసాగించారు
పాదయాత్రగా గ్రామాల్లోకి – సానుభూతి దక్కేలా

పోలీసులు తనను అడ్డుకుంటున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన చంద్రబాబు..కుప్పంలో పర్యటనకే నిర్ణయించారు. అటు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను తప్పు బడుతూనే.. రాజకీయంగా తాను నిర్ణయించుకున్న కార్యక్రమాలను కొనసాగించారు. ప్రచార వాహనం..రోడ్ షో లేకపోయినా…గ్రామల్లో పాదయాత్ర ద్వారా పర్యటన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కుప్పంలో చంద్రబాబు బలం తగ్గి.. వైసీపీ బలం పెరిగిందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో అదే నియోజకవర్గంలో పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం తనను వేధిస్తోందంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నం కొనసాగించారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ తో సహా ఇతర పార్టీల నేతలు ప్రభుత్వ తీరును తప్పు బట్టారు. చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు తన నియోజకవర్గంలో పర్యటించే హక్కు ఉందంటూ సపోర్ట్ చేసారు.
తొక్కిసలాట ఆరోపణల నుంచి దారి మళ్లిన వ్యవహారం..

ఒక్క రోజులోనే చంద్రబాబు తన పైన జరుగుతన్న ప్రచారాన్ని డైవర్ట్ చేసారు. తొక్కిసలాట ఘటనల పైన వైసీపీ పూర్తిగా చంద్రబాబును ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నం చేసింది. జీవో వైసీపీకి అమలు అవుతుందని ఆ పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేసారు. కానీ, చంద్రబాబు ఆ జీవోను తనను ఇబ్బంది పెట్టేందుకే తీసుకొచ్చారనే విధంగా ప్రచారం చేయటంలో కొంత మేర సక్సెస్ అయ్యారు. చంద్రబాబు కుప్పం పర్యటన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో అప్పటి వరకు వైసీపీ చంద్రబాబు లక్ష్యంగా చేసిన తొక్కిసలాట ఆరోపణలు కుప్పం పైకి మళ్లాయి. కుప్పంలో చంద్రబాబు -పోలీసుల మధ్య వాగ్వాదం పైనే వైసీపీ నేతలు స్పందించారు. ఇక, చంద్రబాబు కుప్పంలో తన పర్యటన కొనసాగిస్తున్నారు. కుప్పం పర్యటనలో ఒక్క రోజుతో మొత్తం రాష్ట్రంలో పొలిటికల్ సీన్ మారిపోయింది. ఇప్పుడు కుప్పం కేంద్రంగా రాజకీయం కొనసాగుతోంది.