Food

అబ్బా…బూరి!

అబ్బా…బూరి!

ఎర్రని బుర్రుని తీపి బూరి
చలి గిలిలో వేడి వేడి బూరి
తింటూ అలా…మురిసిపోవాలి
వంట ఇంటిలో గిన్నెల సవ్వడి
గడబిడ ముక్కుపుటాల ఊపిరి రవళి
డుర్రు బర్రుమనే మిక్సీ మోతలు
ఎలాగో తయారైన తోపు సరి
ఏలక్కాయ సుగంధాల గాలి
ఆగలేని ఆకలి పేగుల కూతలు
అలసిన ఆలికి చిరు చెమటలు
సలసల కాగే నూనెలో బంతులాటలు
చుయ్…చుయ్ మని నూనెలో తేలే బొంగరాలు
అబ్బో అబ్బో చూడగా పెద్ద హడావిడి
అటు ఇటు పిల్లలు పరుగులు సరి సరి…
జలజలా రాలే జిహ్వ లాలాజలాలు
ఇక ఆగలేని పొట్ట ఆకలి అరుపులు
అంతలో శ్రీమతి ‘ఏమండీ’ ముద్దు పిలుపులు
హైజంప్ లాంగ్ జంప్ పరుగులు
గోముగా…చీరకొంగుతో సయ్యాటలు
ఇష్టమైన తిండి వెండి పళ్లంలో ఊరించే బూరెలు
ఘుమ ఘుమలాడే బూరెలు ఓ…ప్రక్క
కందిపోయిన బూరి బుగ్గల అందాలు మరో…పక్క
సంసారం జీవిత ఉయ్యాల రసఘట్టాలు
ఇదిరా! పసందైన మరువలేని ప్రేమల విందులు
ఇవేరా…బకాసుర భర్త ప్రియులకు ఘనమైన ముచ్చట్లు!!
ప్రభ,మైసూరు.