DailyDose

సంక్రాంతి ప్రత్యేకత ఇదే

సంక్రాంతి ప్రత్యేకత ఇదే

సంక్రాంతి నిర్వచనం
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

సూర్యుడు ప్రతి నెలా ఒక రాసి నుండి ఇంకో రాశిలోకి మారుతుంటాడు. మేషాది ద్వాదశి రాశుల్లోకి అంటే పూర్వ రాసిలోంచి ఉత్తర రాశిలోకి మారుతుంటాడు.. అలా సూర్యుడు, మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రాంతి. పుష్యమాసంలో ఉత్తరాయణ పథంలో సూర్యుడు మకర రాశిలో అడుగు పెట్టడమే మకర సంక్రాంతి. సంక్రాంతి నెల పవిత్రమైనదని, స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి.

మనం సంక్రాంతి అని పిల్చుకుంటే మహారాష్ట్రీయులు, గుజరాతీలు మకర సంక్రాంతి అంటారు. తమిళులు పొంగల్ అని పిలిస్తే పంజాబీలు లోరీ అంటారు. సంక్రాంతి అందరికీ ఇష్టమే అయినా, రైతులకి మరీ ప్రియమైన, పెద్ద పండుగ. అప్పుడే పంట చేతికి రావడంతో ఎంతో ఇష్టంగా, ఘనంగా జరుపుకుంటారు. మూడు రోజుల ఈ పండగలో మొదటిరోజు భోగి, రెండవ రోజు పండుగ, మూడవరోజు కనుమ.

జయసింహ రాసిన ‘కల్పధ్రుమం’లో సంక్రాంతిని ఇలా వర్ణించారు –

“తత్ర మేశాదిషు ద్వాదశ రాశి
క్రమణేషు సంచరితః
సూర్యస్య పూవస్మాద్రాసే ఉత్తరః రాశౌ
సంక్రమణ ప్రవేశః సంక్రాంతి”

దీని అర్ధం ఏమిటంటే మేషం మొదలైన పన్నెండు రాసులలో సంచరించే సూర్యుడు ముందు ఉన్న రాశి లోంచి తర్వాతి రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి.

తలంటి పోసుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, వాకిట్లో ముగ్గులు, శోభ.. ఇంతవరకూ మూడు రోజులూ ఒకేవిధంగా ఉంటుంది. మరి భోగి విశేషం ఏమిటంటే తెల్లవారుజామున లేచి భోగి మంటలు వేస్తారు. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు సాయంత్రం భోగిపళ్లు పోస్తారు. రేగిపళ్ళలో డబ్బులను కలిపి దోసిళ్ళతో చిన్నారి తలపై అక్షింతల్లా పోస్తారు. ఇలా చేయడంవల్ల దిష్టి ఏమైనా ఉంటె పోతుందని, మంచి జరుగుతుందని పెద్దలు చెప్తారు.

ఇక పండుగనాడు ప్రత్యేకంగా పూజ చేసుకుని కొత్త బట్టలు వేసుకుంటారు. పిండివంటలు, బంధుమిత్రుల సందడితో శోభాయమానంగా ఉంటుంది. అప్పటివరకూ అలంకరించిన గొబ్బెమ్మలను ఎండబెట్టి, కనుమనాడు వాటిని రాజేసి పాయసం వండి అందరూ ప్రసాదంగా ఆరగిస్తారు. కనుమనాడు కొందరు ‘కలగూర వంటకం’ పేరుతో అనేక రకాల కూరగాయలను కలగలిపి కూరగా చేసి తింటారు.