DailyDose

ఎస్‌బీఐ ఏటీఎం చోరీ.. 19 లక్షలు స్వాధీనం…

ఎస్‌బీఐ ఏటీఎం చోరీ.. 19 లక్షలు స్వాధీనం…

జగిత్యాల: జిగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో దుండగులు సినీఫక్కీలో ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని వేములవాడ రోడ్డులో ఉన్న ఏటీఎంలో నలుగురు వ్యక్తులు శనివారం రాత్రి నగదు ఎత్తుకెళ్లారు. ఏటీఎం నుంచి డబ్బులు తీస్తుండగా అందులో ఉన్న అల్లారం మోగింది. దీంతో అప్రమత్తమైన పెట్రోలింగ్‌ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే డబ్బును పెట్టెల్లో పెట్టుకున్న దొంగలు.. కారులో ఎక్కుతుండగా పెట్రోలింగ్‌ వాహనం అక్కడికి చేరుకున్నది. గమనించిన దుండగులు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నుంచి డబ్బుల బాక్స్‌ రోడ్డుపై పడిపోయింది. ఎదురుగా వస్తున్న వాహనం దానిని గుద్దేయడంతో అందులో ఉన్న డబ్బు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. సుమారు రూ.19 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు దొంగలను పట్టుకోవడానికి యత్నించినప్పటికీ చిక్కకుండా పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.