Politics

చెప్పలేనంత మెజారిటీతో టిడిపి విజయం

చెప్పలేనంత మెజారిటీతో  టిడిపి విజయం

12 నుంచి 14 శాతం మెజారిటీ ఉండే అవకాశం

వై నాట్ 175 అన్నది కలలో కూడా సాధ్యం కాదు

దారుణంగా పడిపోతున్న తమ పార్టీ ట్రెండ్

ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఒంగోలు నెల్లూరు, అనంత కర్నూల్, కడప చిత్తూరులలో టీడీపీ దే హవా

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

రాష్ట్రంలో ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ చెప్పలేనంత మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. 12నుంచి 14 శాతం ఎక్కువ మెజారిటీ ఆ పార్టీకి లభించే అవకాశం ఉంది. కుల, మతాలకతీతంగా అన్ని వర్గాలు టిడిపికి దన్నుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. ఇటీవల తాను ప్రాంతాల వారిగా ఫ్లాష్ సర్వే నిర్వహించినట్లు రఘురామ కృష్ణంరాజు వివరించారు. ఈ సర్వేలో టిడిపి కూటమికి స్పష్టమైన మెజారిటీ లభిస్తుందని తేటతెల్లమయిందన్నారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఉత్తరాంధ్ర లో పది నుంచి 12 శాతం టిడిపికి ఎడ్జ్ ఉండగా, ఉభయగోదావరి జిల్లాలలో 14 నుంచి 16 శాతం, కృష్ణా, గుంటూరు జిల్లాలలో 12 నుంచి 14 శాతం, ఒంగోలు నెల్లూరులలో ఎనిమిది నుంచి పది శాతం, అనంతపురం, కర్నూలులలో 10 నుంచి 12 శాతం, కడప చిత్తూరులలో 6 నుంచి 8 శాతం టిడిపికి ఎడ్జ్ ఉందని తెలిపారు. టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని తాను మొదటి నుంచి చెబుతున్నానని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు.

కలలో కూడా అవకాశమే లేదు

వై నాట్ 175 అని తమ పార్టీ నాయకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ, కలలో కూడా అవకాశమే లేదని రఘు రామ కృష్ణంరాజు అన్నారు. టిడిపికి అనూహ్య ఆదరణ లభించడం ఆశ్చర్యకర పరిణామం.
రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ఎలా మ్యాజిక్ ఫిగర్ సాధిస్తుందో అర్థం కావడం లేదు. ప్రస్తుత ట్రెండ్ పరిశీలిస్తే, తమ పార్టీకి దారుణమైన పరాభవం తప్పదు. అబద్దాలతో ఎన్నిరోజులు ఈ నాటకాలను ఆడగలం. గత ఎన్నికల్లో అప్రతిహత విజయానికి దోహదపడిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అందులో, ఒక్క అవకాశం ఇవ్వండి… రాజన్న రాజ్యం చేసి చూపిస్తానని హామీ ఇవ్వడం… దానితో ప్రజలు అవకాశమే కదా అని మనకు ఒక అవకాశం ఇచ్చారు. ఏమైందో ప్రజలు చూశారు. ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు.

టక్కు టమారా విద్యలతో మేనేజ్ చేసేవారు

ఎన్నికలలో ఓటింగ్ పర్సంటేజ్ మూడు నాలుగు శాతం అధికంగా ఉంటే తమ టక్కు, టమారా విద్యలతో మా పార్టీ నాయకులు మేనేజ్ చేసి ఉండేవారని రఘురామకృష్ణంరాజు అన్నారు. ప్రభావిత ఓటింగ్ శాతం ఎక్కువగా ఉందని, ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. గత ఎన్నికలకు ముందు బాబాయి హత్య ను తెలుగుదేశం పార్టీ పైకి తోసి, నారాసుర రక్త చరిత్ర అని సాక్షి దినపత్రికలో తప్పుడు కథనాలను రాశాము. అబద్ధాలు నమ్మినంత సునాయసంగా, నిజాన్ని నమ్మకపోవడం మానవ నైజం. చిన్నాన్నను ఎవరు చంపారన్నది ఇతమిద్దంగా ఇప్పటికే తేలిపోయింది. ఎవరు చంపించారు అన్నది తేలడానికి కొంచెం టైం పట్టవచ్చు. చంపించింది మా పార్టీ వారు ఆరోపించిన వారు కాదన్నది తెలిసిపోయింది. గతంలో తమ పార్టీ గెలుపుకు బ్రహ్మాస్త్రంగా దోహదపడిన చిన్నాన్న హత్య, ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో తమనే దెబ్బ కొట్టే ప్రమాదం ఉంది. కోడి కత్తి కేసులో జరుగుతున్న ఆలస్యం, ట్రయల్ కు బాధితుడు వెళ్లకపోవడం వంటివి పరిశీలిస్తే ఈ కేసులో జరిగిందేమిటో ప్రజలకు తెలిసిపోయింది. మళ్లీ అటువంటి ప్రయత్నాన్ని చేస్తే కామెడీగా ఉంటుంది. ఒక్క ఛాన్స్, కోడి కత్తి, గొడ్డలి పోటు తమ పార్టీకి రివర్స్ అయ్యింది. మధ్య నిషేధం చేస్తామని చెప్పి, చేయకపోవడంతో మహిళలకు ఇచ్చిన సొమ్మును వారి భర్తలు దోచుకొని మనకు సమర్పయామి చేస్తున్నారన్నారు.

రాజ్యాంగ సంక్షోభమే…

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ రాజధానిగా పరిపాలన చేపడితే రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. సుప్రీంకోర్టు, న్యాయ వ్యవస్థను దిక్కురించినట్లు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి లు సచివాలయం ఉన్నచోట ఉంటే, ముఖ్యమంత్రి ఒక్కడే విశాఖకు వెళ్ళిపోతారట. ఏప్రిల్ నుంచి విశాఖ రాజధానిగా పరిపాలన చేస్తామని మంత్రులు, తమ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయి. అర్థంపర్థం లేని మాటలను తమ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడితే ఓటింగ్ శాతం పెరిగి వై నాట్ 175 సాధ్యం అవుతుందా?. చేసేదే చెప్పాలని, చెప్పేదే చేయాలని… అంతేకానీ సాక్షి దినపత్రిక కథనాలను చూసి ప్రజలు మోసపోతే మోసపోయి ఉండవచ్చు కాక, కానీ మనము మోసపోవద్దని రఘురామ కృష్ణంరాజు సూచించారు.

98.7 శాతం హామీలను అమలు చేయలేదు

రాష్ట్ర ప్రజలకు మనం ఇచ్చిన 98.7 శాతం హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయలేదంటే ప్రజలు నమ్ముతారని రఘురామకృష్ణం రాజు అన్నారు. అంతేకానీ 98.7 హామీలను అమలు చేశామంటే, ఎవరు నమ్మరని ఆయన పేర్కొన్నారు. చెప్పనివి కూడా చేశామంటే నిజమే. ప్రజలపై చెత్త పన్ను వేస్తామని చెప్పలేదు కానీ వేశాము. అలాగే ఆస్తి పన్నును పెంచాము. విద్యుత్ చార్జీలను ఏకంగా ఏడుసార్లు పెంచిన ఘనత మనకే దక్కింది. మీటర్లను సొంత కంపెనీ లాంటి కంపెనీ వద్ద నుంచి రెండు మూడు రేట్లు అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేశాము. సాక్షి దినపత్రికలో మనము రాసిందంతా జనం నమ్ముతారనుకుంటే పొరపాటే. కావాలంటే మీరు సర్వే చేయించుకోండి… ఇప్పటికే చేయించుకొని ఉంటారు. తాను చేయించిన సర్వే ఫలితాలు కంటే, గొప్పగా ఏమీ ఫలితం కనిపించదు. బ్రహ్మాండం భజగోవిందం అని వస్తే ఆత్మావలోకనం కోసం మీరు చేసిన సర్వే విధానం, తాను చేయించిన సర్వే విధానంపై చర్చించుకుందాం. 45 రోజుల వ్యవధిలో నియోజకవర్గాల వారీగా సర్వే ఫలితాలను వెల్లడిస్తాను. టిడిపి జనసేన కలవడం, అగ్నికి వాయువు తోడైనట్లయింది. కారు చిచ్చు లాగా మారి ఆ మంటల్లో తమ పార్టీని దహించి వేస్తుందేమోనని నా భావన అంటూ రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

కర్నూల్లో హైకోర్టు కావాలా?… సాగునీటి ప్రాజెక్టులు కావాలా??

రాయలసీమ ప్రజలకు కర్నూల్లో హైకోర్టు కావాలా?, సాగునీటి ప్రాజెక్టులు కావాలా అని ఓటింగు పెట్టాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. గాలేరు నగరి, హంద్రీ నివా, వెలిగొండ ప్రాజెక్ట్, డ్రిప్ ఇరిగేషన్ కావాలా?, లేకపోతే రాయలసీమలో హైకోర్టు కావాలా అని అడిగితే రాయలసీమ ప్రజలు తమ మనోభావాలను వెల్లడిస్తారు. టిడిపి ప్రభుత్వ హయాంలో 58 వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేశారని మనమే గతంలో పేర్కొన్నాం. నాలుగేళ్లలో మనం 18 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశాం. ఇప్పటికీ వెలుగోడు ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఒంగోలు, కడప ప్రజలకు సాగునీటి సమస్య తీరుతుంది. హంద్రీనీవా, సుజల స్రవంతి, గాలేరు నగరి రెండవ దశ ప్రాజెక్టులు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ముందడుగు పడింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుంది. కృష్ణా డెల్టాను స్థిరీకరించవచ్చు. పోతిరెడ్డిపాడు కృష్ణా నీటిని రాయలసీమకు తరలించవచ్చు. ఏలేశ్వరం ద్వారా ఉత్తరాంధ్రకు పోలవరం నీటిని తీసుకు వెళ్ళవచ్చు. ఎన్నో సౌకర్యాలు ఉన్న పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం మాని, సాగునీటి పారుదల శాఖ మంత్రి సంక్రాంతి పండుగనాడు సరదాగా రికార్డింగ్ డాన్సులు చేయడం విడ్డూరంగా అనిపించిందని రఘురామకృష్ణం రాజు అన్నారు.

విశాఖ రాజధానిపై పూటకో మాటనా?

రాష్ట్రానికి మూడు రాజధానులు అని చెప్పిన తమ పార్టీ నాయకులు పూటకో మాట మాట్లాడుతున్నారని రఘురామకృష్ణం రాజు ధ్వజమెత్తారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అని చెప్పిన రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఇప్పుడు విశాఖ నే రాజధానిగా కావాలనడం విడ్డూరంగా ఉంది. విశాఖను రాజధానిగా చేయకపోతే, విశాఖ రాజధానిగా ఏర్పాటు చేస్తూ ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రాన్ని కోరుకోవడం మరింత హాస్యాస్పదం. రెవిన్యూ మంత్రి ఏమైనా బాధ్యత లేనివారా?, లేకపోతే ముఖ్యమంత్రి ఆయన చేత ఈ విధంగా మాట్లాడించారా?? అని ప్రజలు భావిస్తున్నారన్నారు.

సేవా తత్పరత ఉన్నవారికి ఓటు వేస్తారు..

సేవా తత్పరత ఉన్న వారికే ప్రజలు ఓటు వేస్తారని, గత చరిత్ర ఈ విషయాన్ని రుజువు చేసిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. మూడేసి పెళ్లిళ్లు చేసుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, కరుణానిధులను ప్రజలు గెలిపించారు. అలాగే బ్రహ్మచారిగా ఉన్న వాజ్పేయిని కూడా గెలిపించారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని, తమకు ఓటు వేయాలని కోరడం హాస్యాస్పదంగా ఉంది. పవన్ కళ్యాణ్ పై, తమ నాయకుడి మాదిరిగా 31, 32 కేసులు లేవు. ఏ నిర్మాతను ఆయన వేధించిన దాఖలాలు లేవు. ఇక పవన్ కళ్యాణ్ పై చేయడానికి ఎటువంటి ఆరోపణలు లేక, తమ పార్టీ వారు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని విమర్శించడం విడ్డూరంగా ఉంది. చట్టబద్ధంగా విడాకులు తీసుకుని, ఆయన వివాహాలను చేసుకున్నారు. నోటికొచ్చినట్లు చెత్త మాట్లాడితే, అది మనకే రివర్స్ అవుతుంది. మనకు ఓటు వేయడానికి, పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి అసలు ఏమైనా సంబంధం ఉందా?. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు కాబట్టి, మాకు ఓటు వేయమని అడగడం మన లేకితనానికి నిదర్శనం కాదా?. ఇతరులు మన వంశ చరిత్రను తవ్వి తీయరా?. మన పరిపాలన ఎలా ఉందో ప్రజలకు చెప్పాలి. ఎస్సీ సబ్ ప్లాన్ లో 27 అంశాలు ఉంటే, అందులో ఒక్కటి కూడా మనం ఆచరణలో అమలు చేయలేదు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు, అమ్మ ఒడిలో భాగంగా నిధులు ఇచ్చి ఎస్సీ సబ్ ప్లాన్ అమలు చేశామనడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు.