DailyDose

వేమన్న చెప్పింది వేదం రా..!!

వేమన్న చెప్పింది  వేదం రా..!!

వేమన జయంతి సందర్బంగా..

ఉప్పు కప్పురంబు
ఒక్క పోలికనుండు..
చూడ చూడ
రుచుల జాడ వేరు
కవులందు వేమన వేరయా
వినర తెలుగోడా..!

కవిత్రయమన్న
తిక్కన,వేమన,గురజాడ
ఇది శ్రీశ్రీ మాట..!

వానలో తడవని..
వేమన శతకం వినని
మనిషి ఉండడనేది
నిస్సందేహం..
అంతటి శక్తిమంతం
ఆయన కవితా ప్రవాహం..!

మాసిన గడ్డం..
ఒంటిపై గోచీ..
వంచిన శిరస్సు…
అందులో ఎంత తేజస్సు..
తరిగిపోని యశస్సు..
ఇదీ నాలుగు మాటల్లో
వేమన..వివరంగా చెప్పాలంటే
అంతే ఉండని
మహాగ్రంధమని
నా భావన..!

భోగి కాని వాడు
యోగి కాలేడన్న ఆర్యోక్తి..
వేమనకే ఉపయుక్తి..
జీవితమంతా విలాసం..
వ్యసనాలతో ఉల్లాసం..
చెడు సావాసం..
ఒకనాటికి ముంచుకొచ్చిన
వైరాగ్యం..
పొర్లుకొచ్చిన కయితలు..
సిసలైన జీవిత కతలు..!

వేశ్యల చుట్టూ
తిరిగిన వేమయ్య..
బంధాల దాస్య విముక్తి
పొందిన సిద్ధయ్య..
మూడు వాక్యాల్లో తత్వబోధన..
నాలుగో వాక్యంలో
కృతజ్ఞతా భావన..!
విశ్వదాభిరామ
వినుర వేమ..
నీ చుట్టూ ఉండే సీమ
మొత్తం భ్రమ!

నచ్చింది..మెచ్చింది
ఆటవెలది..
అందులోనే రాసేశాడు
తత్వాలు వందలకొలది..
ఔపోసన పట్టి పరసువేది
విరక్తి పుట్టి అయ్యాడు
సిసలైన తత్వవాది..
జమీందారో..రారాజో
ఆయన రచనలు
ఆశనిరాశల తరాజు..
వేదవేదాంగాల బేరీజు..!

వేమన వాదంలో
ప్రధానంగా నిర్వేదం..
తిరుగుబాటు.. జరుగుబాటు…
జీవిత అర్థం..పరమార్థం..
ప్రతీదీ యదార్థం..
చక్కని ప్రతిపదార్థం..
ఒక్కోసారి అర్థం కాని
బ్రహ్మపదార్థం..!

ఏదేమైనా..భాష సరళం..
భావం నిండా
ఆయన త్రాగిన గరళం..
చవిచూసిన గందరగోళం..
గుణపాఠం చెప్పిన సానిమేళం..
తన అనుభవాలే తత్వాలు
తలవంచిన సంకుచత్వాలు
మొత్తంగా వేమన తానయ్యాడు
తాత్వికుడు..బోధకుడు..
అంతిమంగా దార్శనికుడు
అందుకే వేమన పలుకులు
ఎప్పటికీ ములుకులు..!