Movies

స్వర్గీయ జమునకు నివాళి.TNI కథనాలు..

స్వర్గీయ జమునకు నివాళి.TNI కథనాలు..

#సీనియర్ నటి జమున, సినిమా లోకి రాకముందు ఆమె పేరు జానాభాయి…

కర్ణాటక లోని హంపి లో 1936 ఆగస్టు 30 న జన్మించారు, గుంటూరు జిల్లా దుగ్గిరాల లలో పాఠశాల లో విద్యాబ్యాసం చేసిన జమున తన తల్లి దగ్గర సంగీతం నేర్చుకున్నారు,తెలుగు,కన్నడ,తమిళ తో పాటు వివిధ భాషల్లో నటించారు 14 ఏళ్ల వయసులో పుట్టిల్లు సినిమా లో నటించి చిత్ర ప్రవేశం చేశారు..

# గోదారి గట్టున
సెట్టుకొమ్మ పిట్ట..!

🌸🌸🌸🌸🌸🌸🌸

తెలుగు సినిమా సత్యభామ
అలకా గృహానికి వెళ్ళిపోయింది..
కృష్ణుడు మురిపిస్తాడనుకుంటే
ఆయన అక్కడికే
వచ్చెయ్యమన్నాడు…
తగవు పెట్టే..ఆ తగవు తీర్చే
నారదుడూ అక్కడే ఉన్నాడు..
అందుకే ఇక సెలవంటూ
అందాల సాత్రాజితి
స్వర్గపురికి మరలిపోయింది..!

జమున..
ఖరీదైన జరీచీర కట్టి
భుజాన శాలువా చుట్టి..
చలువ కళ్లద్దాలు పెట్టి
రాజభవంతి మెట్లు
దర్జాగా దిగుతుంటే
అచ్చెరువొందిన జనం
ఆహా..రాణీ మాలినీదేవి
అని మురిసిపోయారు…
ఆ దర్పం..పొగరు..
జమునకే చెల్లు..!

అదే జమున..
అలిగి శయ్యపై పరుండి
శ్రీకృష్ణుడు ఎన్టీఆర్
కిరీటంపై తంతే
సత్యభామకు ఇంత టెక్కా
అని ముక్కున వేలేసుకున్నారు…
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్..
జమునకే ఒప్పిన భంగిమన్..!

అదే అభినేత్రి..
అమ్మా కాఫీ అంటూ
గారాలు పోతూ..
పెళ్ళిచూపులకి వచ్చిన
రామబ్రహ్మం ఎస్వీఆర్ కి
సరోజ అని పుల్ల విరుపుగా
చెబితే గుండమ్మ కూతురు
ఇలాగే ఉండాలని
తెగ నచ్చేసారు..
నందమూరే విస్తుపోయెలా
ఎవడమ్మా వీడు అంటూ అంజిగాడిని గురించి అడిగితే
ఆశ్చర్యపోయినా
డాబాపై తిష్టవేసిన రాజాకి
అమృతాంజనం రాసి సిగ్గుపడితే పెద్దింటి పిల్ల
సొగసుగా సిగ్గుపడిందనుకుని
ముచ్చటపడ్డారు
నాటి తెలుగింటి అమ్మలక్కలు..!

కైకమ్మ కులుకు..
తాసిల్దార్ గారమ్మాయి తళుకు
ఉండమ్మా బొట్టు పెడతా
అంటూ లచ్చిమి తల్లినే ఆపేసిన అణకువ..
ఏ పాత్రకు ఏ అభినయం
అవసరమో..అందమో
ప్రదర్శించే మెలకువ..
మంగమ్మ శపథం..
శబరి భక్తి..
ద్రౌపది పంతం..
జమునకే నప్పిన నటన..
ఆమెకే ఒప్పుననే
అభిమాన భావన..!

అంతటి అందాలరాశి
అనారోగ్యంతో
మూగనోము పట్టినా..
నేనోడిపోయి గెలుపొందినాను
అంటూ ఇప్పటికీ పరిశ్రమతో
చెక్కుచెదరని బంధం..
ఒకనాటి ఆమె సౌందర్యం
అక్కలు సావిత్రి..అంజలి..
భానుమతి వెళ్ళినా
హుషారుగా కళ్ళముందు
తిరుగాడిన
ఆరోగ్య రహస్యం..
అదే అదే వింత నేను తెలుసుకున్నది..
అంటుందా..
లేక మాను మాకును కాను
రాయి రప్పను కానే కాను
మామూలు మనిషిని నేను..
మీ జమునను నేను..
అన్నది మన
అచ్చ తెలుగు గౌరమ్మ!

దిగ్గజాలు తరలి వెళ్ళినా
అందరి గురుతుగా నేనున్నానంటూ
కళ్ల ముందు కటలాడిన
ముద్దుగుమ్మ..
అలసిపోయి వెళ్ళిపోయింది..
అందం తగ్గినా వన్నె తగ్గని
అరుదైన సొగసు..
అప్పటికీ…ఇప్పటికీ..
ఎప్పటికీ..
జమున..ప్రశాంత యమున..
గలగలా గోదారి..!

🙏🙏🙏🙏🙏🙏🙏

జమునమ్మకు వీడ్కోలు
పలుకుతూ అక్షరాంజలి..

#అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమున గారు. చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195 పైగా సినిమాలలో నటించి నవరసనటనా సామర్ధ్యం కనబరిచారు జమున గారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రసంశలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున గారు… నాన్నగారు అన్నట్లుగా కళకు కళాకారులకు మరణం ఉండదు.. ఈ రోజున జమున గారు బౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి… వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.
-నందమూరి బాలకృష్ణ