Devotional

*తిరుమలలో రథసప్తమి వేడుకలు, ఘనంగా ఏర్పాట్లు..

*తిరుమలలో రథసప్తమి వేడుకలు, ఘనంగా ఏర్పాట్లు..

తిరుమలలో ఈ నెల 28న రథ సప్తమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడానికి టీటీడీ సర్వం సిద్ధం చేస్తోంది. తిరుమలలో రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలు అంటారు.

సూర్య జయంతి సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రంలో రథ సప్తమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సర్వం సిద్ధం చేస్తోంది. తిరుమలలో జరిగే రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ మేరకు తిరుమలలో ఈ నెల 28వ తేదీన రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రథ సప్తమి పర్వదినం నేపథ్యంలో ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
వాహన సేవల వివరాలు..
• ఈ నెల 28న ఉదయం 5.30 గంటల నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) సూర్యప్రభ వాహనం.
• ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం.
• ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం.
• మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం.
• మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం.
• సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం.
• సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం.
• రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం