Devotional

నేడు రథసప్తమి.. ప్రత్యేకత ఇదే

నేడు రథసప్తమి.. ప్రత్యేకత ఇదే

🌞 రథ సప్తమి🌞

ఈరోజు జనవరి 28 శనివారం రథ సప్తమి సందర్భంగా…

మాఘ మాసే శుక్ల పక్షే సప్తమ న్యాద్ర దస్యతు
తత్ర స్కానాంచ దానాంచ తత్పర్యం చాక్టయ మబ్రవీత్

మాఘమాసం శుక్ల పక్ష సప్తమినే రథ సప్తమి అంటారు. సూర్యభగవానుడు రథాన్ని అధిరోహించి భూమికి దగ్గరగా వస్తాడు. అంతకు ముందు కొద్ది రోజుల నుండే, అంటే మకర సంక్రమణం నుండే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ మవుతుంది.

ఉత్తరాయణం ప్రవేశించగానే మొట్ట మొదట వచ్చే శుద్ధ సప్తమే రథసప్తమి. సూర్యుడు ఉత్తరదిశగా ప్రయాణిస్తాడు. ఈ రథసప్తమినుండే ఆయన శక్తి సంపూర్ణంగా భూమిపై విస్తరించి ఉంటుంది. సూర్యుడు జన్మించిన రోజును రథ సప్తమిగా ఆచరిస్తున్నారు. ఆయన ప్రత్యక్ష నారాయణుడు రథం మీదే లోక సంచారం చేస్తూ భూమిపై ప్రజలందరకీ ఆరోగ్య ప్రదాతగా, ఐశ్వర్య ప్రదాతగా గోచరిస్తున్నాడు.

నమో రుద్ర రూపాయ రసానాం పతయే నమః అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే యద్యజ్జన్మకృతం పాపం మయా జన్మను సప్తమ తన్మే రోగం, శోకం, మాకరీ హంతు సప్తమీ ఏత జ్జన్మ కృతం పాపం, యజ్జన్మాంత రార్జితమ్ మనో వాక్కాయజం, యచ్చజ్ఞాతా జ్ఞాతేచ యే పునః ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్త కే సప్త వ్యాధ సమాయుక్తం, హరమాకరీ సప్తమీ

రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు శిరస్సుపై ఏడు జిల్లేడు. ఆకులను, రేగి పళ్ళను పెట్టుకొని ఈ శ్లోకం చదవాలి. అలా చేయడం వల్ల సకల పాపాలు పోయి, ఆరోగ్యంసిద్దింస్తుంది. రథానికి ఉన్న ఏడు గుర్రాలు ఏడు రోజులకు సంకేతంగా చెపుతున్నారు. యోగ శాస్త్ర ప్రకారం మనశరీరమే రథం. అశ్వాలు ఇంద్రియాలు. బుద్ధి రథసారథి. మనస్సు పగ్గాలు. మాఘమాసంలో ప్రతీ ఆదివారం మన ఇళ్ళల్లో సూర్య కిరణాలు పడేటట్లుగా, బియ్యంతో పరమాన్నం వండి ఆర్పిస్తారు. మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. ఎంతో మహిమాన్వితమైన ప్రసాదం ఆయువు వృద్ధి, సకల సౌభాగ్యాన్ని సమకూరుస్తుందని పురాణాలు విశదీకరిస్తున్నాయి.

సూర్యుడు త్రిశక్తి స్వరూపుడు. శ్రీఆదిత్య స్తోత్రంలో

బ్రహ్మ స్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరః
సంధ్యా కాలే స్వయం విష్ణుః స్త్రయీమూర్తి దివాకరః

అని మూడు సమయాలలో తన తేజస్సుతో ప్రత్యక్షమవుతున్నాడు. ప్రత్యేకంగా రథ సప్తమి రోజున కూడా ఆదివారంలో లాగానే పరమాన్నం తయారుచేసి, చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి, ఆ సూర్య భగవానుని ఊరేగిస్తారు. సూర్య స్తుతి చేస్తారు. ఇంత ప్రాధాన్యత రథసప్తమికి ఉంది. సూర్యుడు ఆరోగ్య ప్రదాతే కాదు. ఏది కోరితే అది ఇవ్వగల సమర్థుడు. పంచ పాండవులు అరణ్య వాసానికి వెళుతున్నప్పుడు పురజనులు, హితులు, మహర్షులు వెంట వస్తున్నప్పుడు, వారికి అతిథి మర్యాదలు, ఆహారం సమకూర్చడానికి మానసికంగా ఆలోచిస్తుంటే, వాళ్ళ పురోహితుడు, బోధించిన సూర్య అష్టోత్తర శతనామావళి చెప్పగానే ధర్మరాజు సూర్యుని ప్రార్థించగా “అక్షయపాత్ర” ఇచ్చిన సంగతి మనకు తెలుసు. సత్రాజిత్తు సూర్యోపాసన చేస్తే శమంతకమణిని ప్రసాదించినట్లుగా, వినాయక చవితి కథలో మనం చదువుకుంటాం. కర్ణుడుకి సహజ కవచ కుండలాలను ప్రసాదించాడు. శ్రీరాముడికి అగస్త్య మహర్షి సూర్యుని స్తుతి “ఆదిత్య హృదయం” బోధించడం వల్ల, శ్రీరాముడు శక్తిమంతుడై, రావణాసురుని యుద్ధంలో ఓడించాడు. ఆదిత్య హృదయం చాలా శక్తివంతమైనది. ఆరోగ్యాన్ని సమకూర్చేది. ఒక సారి ఆంధ్రప్రదేశ్ నుండి శృంగేరి పీఠాధిపతి దర్శనానికి వెళ్ళిన భక్తుడు, స్వామి ని దర్శించి, “తనకు చాలా రోజులనుండి అనారోగ్యంగా ఉంటోంది. వైద్యం చేయిస్తున్నా, కుదుట పడుటలేదు. తమరు ఏదైనా మంత్రోపాసన కాని, దీక్ష కాని చెపుతారని” అనగానే పీఠాధిపతి శ్రీశ్రీభారతీ తీర్థ మహా స్వామిజీ భక్తునితో “నిర్మల భక్తితో ప్రతీరోజూ ఆదిత్య హృదయం పదకొండు సార్లు, మండలం ( 40 రోజులు) పారాయణ చేయమని చెప్పారు. సంవరానికి ఆభక్తుడు సంతోషంగా స్వామిని దర్శించి, తనకు పూర్తి స్వస్థత చేకూరినట్లు తెలిపాడు.

ఒకసారి నారద మహర్షి యాదవులను సందర్శించిన సందర్భంలో, వారంతా లేచి, మహర్షిని గౌరవించారు. అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు, జాంబవతిలపుత్రుడు సాంబుడు, మహర్షిని గౌరవించలేదు. దాంతో నారదుల వారికి కోపం వచ్చి “నువ్వు కుష్టు రోగంతో బాధపడతావు” అని శపించాడు. కొద్ది కాలానికి, సాంబుడు కుష్ఠురోగంతో బాధపడలేక, తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు మధ్య భారత దేశంలోని చంద్రభాగ నదీ ఒడ్డున ఆశ్రమం నిర్మించుకొని సూర్యోపాసన నిష్ఠగా భక్తితో చేయగా రోగం మాయమైంది. ఆయన ద్వారా నే మనకు ద్వాదశాదిత్యుల స్థుతి, సూర్య నమస్కారాలు వంటివి ఎన్నో లభించాయి. ఆంజనేయునికి వేదవిద్యను బోధించాడు. గాయత్రీ మంత్రానికి అధి దేవత సూర్యుడే. అందుకే సంధ్యా వందనం చేస్తారు. సూర్యభగవానుడి కిరణాలు వల్ల చర్మరోగాలు నయమవుతాయి. కంటి జబ్బులు, గుండె జబ్బులకు సూర్యోపాసన పరిష్కారం చేస్తుంది.

మధ్య భారత దేశంలో భద్రేశ్వరుడు అనే రాజు అందగాడు. రాజ్యపాలన సమర్థవంతంగా చేస్తున్నాడు. ధర్మాత్ముడు. అయినా ఆయనకు శ్వేత కుష్టు రోగం (బొల్లి ) శరీరం అంతా వ్యాపించింది. మనోవ్యధతో రాజ్యాన్ని కుమారులకు అప్పగించి, తన పురోహితుల సూచన మేరకు కాశీ క్షేత్రం వెళ్ళి, సూర్యోపాసన గురువుల ద్వారా ఉపదేశం పొంది, బీజాక్షర మంత్ర సహితంగా సూర్యుడిని ఆరాధించాడు. సూర్యుడు ప్రత్యక్షమై సంపూర్ణ ఆరోగ్యంతోబాటు తదనంతరం సూర్య లోకానికి వస్తావని వరమిచ్చి అంతర్థానమయ్యాడు. భగవద్గీత లో శ్రీ కృష్ణ పరమాత్మ

ఆదిత్యానా మహం విష్ణుః జ్యోతిషాం రవి రంశుమాన్
మరీచి రతామస్మి నక్షత్రాణాం మహం శశీ

ద్వాదశాదిత్యులలో విష్ణువు అనే ఆదిత్యుడను నేనే అనిచెప్పాడు. భాగవతం 12వ స్కంధంలో ద్వాదశాదిత్యుల గురించి వివరణ ఉంది. ఒక్కోనెలలో ఒక్కో పేరుతో సూర్యుడిని ఆరాధిస్తారు.🙏
🌞🌹🌞🌹🌞🌹🌞

###.రథ సప్తమి అంటే ఏమిటి?

1_ఈ పర్వదినాన సూర్యుడిని ఎలా ఆరాధించాలి.
2_సూర్యుడికి చేయాల్సిన పూజలు ఏమిటి.
3_ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి?
4_ఈ రోజున ఆచరించాల్సిన వ్రతాలు ఏమిటి.
5_జాతక దోషాల పరిహారానికి ఏం చేయాలి.
6_సూర్య ఆరాధనలో దాగి ఉన్న నియమాలు.
7_సూర్యుడు ప్రపంచానికి ఇస్తున్న సందేశం.
8_సూర్య జయంతి ని రథ సప్తమి అని ఎందుకు అంటారు.
9_స్వామి రథం యొక్క ప్రతేకథ.
10_జిల్లేడు ఆకులతో ఎందుకు స్నానం చేయాలి.
11_సూర్యుడిని ఆరాధించిన హనుమంతుడు,శ్రీరాముడు,ధర్మ రాజు,సాంబుడు,
మయూర కవి.
12_ ఈ రోజు ఏ ఏ శ్లోకాలు ఎప్పుడు చదవాలి.
13_ఈ రోజు ఏం చేయడం వల్ల7జన్మల పాపాలను పోగొట్టుకుంటాం.
14ఆదిత్య హృదయం యొక్క విశిష్టత. ఈ రోజు ఎందుకు తప్పనిసరిగా ఆదిత్య హృదయం చదవాలి.
15.సూర్యునికి ఏ విధముగా ఆర్గ్యము ఇవ్వాలి.ఆర్గ్యం ఇచ్చేటప్పుడు ఏమని ప్రార్ధించాలి.
16.ఎందుకు ఈ రోజు చిక్కుడు కాయలతో రథాన్ని,ఆకుల లో పరమాన్నం నైవేద్యం పెడతాము.పరమాన్నమే ఎందుకు నైవేద్యం పెట్టాలి.
17.స్వామి వారి రథానికి ఉన్న గుర్రాల పేర్లు.వాటి అంతరార్ధం.
18.రథ సప్తమి రోజు స్నానం చేసేటపుడు చదవాల్సిన శ్లోకం.జిల్లేడు ఆకులు పెట్టుకొని ఎందుకు స్నానం చేయాలి.
19.స్నానం చేసేటపుడు ఎన్ని జిల్లేడు ఆకులు పెట్టుకోవాలి.
20.ఏ రంగు పూలతో స్వామిని అర్చించాలి.

: ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమి. భూమికి మొట్టమొదటగా దర్శనమిచ్చి, రథాన్ని అధిరోహించాడని ‘మత్స్య పురాణం’ చెబుతోంది.

ప్రాణులకు చలిని తొలగించి, నూతనోత్తేజం నింపే పర్వదినమిది. ఈ రోజు నుంచి పగటి సమయం ఎక్కువగా రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. ఇతర మాసాలలో సప్తమి తిథులకన్నా మాఘమాసంలో వచ్చే శుక్ల పక్షంలోని సప్తమికి ఎంతో విశిష్టత వుంది. మాఘశుద్ధ సప్తమి నాడు ఆదిత్యకశ్యపులకు సూర్యుడు జన్మించాడు.అందుకే ఈ రోజు సూర్య భగవానుడిని తమ శక్తికొలది పూజిస్తారు…

సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా
సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రధ సప్తమి

పాలు పొంగించే విధానం

సూర్యుని కిరణాలూ పడే చోట..లేదా..తులసిచెట్టు ఉండే దగ్గర ఓ పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేసి, ముగ్గులుపెట్టి, సూర్యభగవానుడి ఫోటోను ఉంచాలి. గంధం, కుంకుమతో బొట్టు పెట్టాలి. ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి.
ఏడు చిక్కుడు కాయలను తీసుకుని రథంగా తయారుచేసుకోవాలి. ఈ రోజు సూర్యునికి నేతితో దీపం వెలిగించాలి
ఆవు పిడకలను కర్పూరంతో వెలిగించి దానిపై ఇత్తడి పాత్ర ఉంచి ఆవుపాలు, బెల్లం, బియ్యం తో చేసిన పరమాన్నం అంటే సూర్యునికి ఎంతో ప్రీతి
పంటలు చేతికొచ్చే కాలం లో వచ్చిన సప్తమి కాబట్టి ఈరోజు వండే పరమాన్నం లో కొత్త బియ్యం వాడుతారు. బెల్లం వేసి చెరుకు గడతో తిప్పుతు పరామానాన్ని తయారు చేయాలి
ఈ పరమానాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యనారాయణుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు ప్రసాద వితరణ కూడా చిక్కుడు ఆకుల్లోనే చేయాలి
పాలు పొంగించడమంటే ఇంటి అభివృద్ధికి సంకేతం. ముందుగా గణపతిని పూజించి…ఆదిత్య హృదయం, సూర్యాష్టకం చదవాలి.

సూర్యారాధన వెనుకున్న ఆరోగ్య రహస్యం

ఆయుర్వేదం ప్రకారం కఫరోగ, పిత్త, బుద్ధిమాంద్యాలను తొలగించే శక్తి జిల్లేడు ఆకులకు, రేగు పళ్లకు ఉంది అని చెబుతారు.. అందుకే రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకు దానిపై రేగు పండుని ఉంచి స్నానం చేయాలని చెబుతారు.
ఈ కాలం లో విరివిగా పాకే తీగ జాతికి చెందిన చిక్కుడు ఆకులపై పరమాన్నం వేసి సూర్యునికి నివేదిస్తారు. ఆయుర్వేద రీత్యా చిక్కుడు ఆకులు, కాయలు మన జీర్ణ వ్యవస్థపై చక్కగా పనిచేసి మంచి శక్తి ఇస్తాయి. చిక్కుడు తరచు తినడం వలన మలబద్ధకం సమస్యలు తొలగుతాయి
ఈరోజు తరిగిన కూరగాయలు తినకూడదు… చిక్కుడు కాయలతో చేసిన కూర మాత్రమే తినాలని (చిక్కుడు కాయలను తరగవలసిన పనిలేదు.. చిక్కితే సరిపోతుంది ) పెద్దలు చెప్పడం లో ఉద్దేశ్యం కనీసం ఈరోజైనా చిక్కుడు కాయలు తినాలి అని చెప్పడమే.
అగస్త్యుడు శ్రీరామునికి ఉపదేశించిన ఆదిత్య హృదయం ప్రతి రోజు పారాయణ చేసేవారు ఈ రోజు 12 సార్లు పారాయణం చేయాలి.
ఈరోజు సూర్యభగవానుడిని ఎర్రటి పూలతో పూజించాలి. సూర్య నమస్కారములు చేయాలి. ఏ విధం గా సూర్యుడు లోకానికి ఉపయోగపడి లోక బాంధవుడు అయ్యాడో అదే విధంగా లోకానికి ఉపయోగపడే మంచి పుత్రుడిని ఇమ్మని కోరుకుంటూ రధసప్తమి రోజు స్త్రీలు వ్రతం ఆచరిస్తారు. ఈ రోజు గొడుకు, చెప్పులు, ఎరుపు వస్త్రం, ఆవుపాలు, ఆవునెయ్యి దానం చేయడం మంచిది. రథసప్తమి రోజున సూర్యుడిని పూజించే అవకాశం లేనివారు ఎదో ఒక ఆదివారం రోజున పూజించినా సత్ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.