DailyDose

ఎల్‌ఐసీ LIC మెడకు అదానీ ఉచ్చు..

ఎల్‌ఐసీ LIC మెడకు అదానీ ఉచ్చు..

➡️కోట్ల మంది పాలసీదారుల సొమ్ముకు ముప్పు

➡️2 రోజుల్లో రూ.18,000 కోట్ల నష్టం

➡️వెనుకా ముందూ చూడకుండా పెట్టుబడులు

➡️అదానీ గ్రూప్‌లో అత్యధిక ఈక్విటీ ఎల్‌ఐసీదే

దేశంలో కోట్లమంది సామాన్యుల సొమ్ము ప్రమాదంలో పడింది.జీవిత బీమాకు ధీమా లేకుండా పోయింది. తనవద్ద ఉన్నది ప్రజల సొమ్ము అన్న ఆలోచన కూడా లేకుండా ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ, అదానీ కంపెనీల్లో అడ్డగోలుగా పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకొంటున్నది.

దేశంలో ఒకే కంపెనీ ఉన్నట్టుగా ఎల్‌ఐసీ సొమ్మును అత్యధికంగా తీసుకెళ్లి అదానీ కంపెనీల్లో కుమ్మరించింది. తీరా ఇప్పుడు హిండెన్‌బర్గ్‌ నివేదికతో అదానీ సామ్రాజ్యం కుప్పకూలే పరిస్థితి రావడంతో ఎల్‌ఐసీ దీపం కూడా కొండెక్కే పరిస్థితి వచ్చింది.

అదానీ పుణ్యమా అని ఎల్‌ఐసీ సంపద రెండురోజుల్లోనే రూ.18 వేల కోట్లకు పైగా హరించుకుపోయింది.

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) పాలసీదార్ల నుంచి ప్రీమియంగా వసూలు చేసిన సొమ్ములో భారీ మొత్తం అదానీ షేర్లలో కరిగిపోయింది. అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టిన పెట్టుబడులు రెండు రోజుల్లోనే రూ.18,000 కోట్లకుపైగా తరిగి పోయాయి.

అదానీ గ్రూప్‌ కంపెనీల్లో ఈ నెల 24 నాటికి ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రూ.81,268 కోట్లు ఉండగా, శుక్రవారం నాటికి రూ.61,621 కోట్లకు పడిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్‌ అదానీ వాణిజ్య గ్రూప్‌పై అమెరికా హెడ్జ్‌ ఫండ్‌ హిండెన్‌బర్గ్‌ చేసిన తీవ్ర ఆరోపణలతో అదానీ గ్రూప్‌ షేర్లు వరుసగా రెండో ట్రేడింగ్‌ రోజైన శుక్రవారం సైతం నిలువునా పతనమయ్యాయి. ఈ దెబ్బ ఎల్‌ఐసీపై గట్టిగా పడింది.

అదానీకి పెద్ద అండ

అదానీ కంపెనీల్లో దేశంలో ఏ మ్యూచువల్‌ ఫండ్‌ చేయనంత భారీగా ఎల్‌ఐసీ సరళంగా పెట్టుబడి పెట్టింది. వాస్తవానికి ఆ గ్రూప్‌ కంపెనీల్లో ప్రమోటర్‌ గౌతమ్‌ అదానీ తర్వాత పెద్ద ఇన్వెస్టర్‌ ఎల్‌ఐసీయే.

దేశంలోని టాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఏ ఒక్కదానికీ అదానీ కంపెనీల్లో 1 శాతం వాటా మించి లేదు. కానీ ఎల్‌ఐసీకి ఐదు అదానీ కంపెనీల్లో 1 శాతంపైగా వాటా ఉన్నది. గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌లో గౌతమ్‌ అదానీ తర్వాత పెద్ద ఇన్వెస్టర్‌ ఎల్‌ఐసీయే.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తాజాగా జారీచేసిన రూ. 20,000 కోట్ల ఎఫ్‌పీవో పరిమాణంలో ఐదు శాతం షేర్లకు ఎల్‌ఐసీ బిడ్‌ వేసింది.ఆ షేర్లను ఇప్పటికే ఎల్‌ఐసీకి కంపెనీ కేటాయించేసింది కూడా.

శరవేగంగా పెట్టుబడులు పెంపు

ఏ మ్యూచువల్‌ ఫండ్‌ అయినా, బీమా కంపెనీ అయినా ఒక కంపెనీలో దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టేటప్పుడు సదరు కంపెనీ ఆర్థిక మూలాలను విశ్లేషిస్తూ క్రమక్రమంగా పెట్టుబడులు పెడుతాయి. ఎల్‌ఐసీ మాత్రం అదానీ గ్రూప్‌ కంపెనీల్లో జెట్‌ స్పీడ్‌తో పెట్టుబడులను పెంచుకొంటూ పోయిందని ఒక మ్యూచువల్‌ ఫండ్‌ విశ్లేషకుడు చెప్పారు.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 2021 జూన్‌ 30 నాటికి 1.32 శాతం వాటా ఉండగా, 2022 సెప్టెంబర్‌ 30 నాటికి 4.02 శాతానికి పెరిగింది. ఇదేరీతిలో అదానీ టోటల్‌గ్యాస్‌లో 2.11 శాతం నుంచి 5.77 శాతానికి, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 2.42 శాతం నుంచి 3.46 శాతానికి ఏడాదికాలంలోనే పెంచుకుంది. ఈ షేర్లు ధరలు పెరుగుతున్నకొద్దీ ఎల్‌ఐసీ కొనుగోలు చేయడం పట్ల విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అదానీ పోర్ట్స్‌లో మాత్రం ఎల్‌ఐసీ వాటా 11.9 శాతం నుంచి 9.8 శాతానికి తగ్గింది. ఏ కంపెనీలోనూ 10 శాతానికి మించి పెట్టుబడులు చేయరాదన్న మ్యూచువల్‌ ఫండ్స్‌ నిబంధనకు అనుగుణంగా ఈ తగ్గింపు జరిగింది తప్ప మరో కారణం కాదు.

ఇంకా పెద్దగా వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభంకాని అదానీ గ్రీన్‌ ఎనర్జీలో 1.15 శాతం వాటా ఎల్‌ఐసీకి ఉన్నది. అదానీ పవర్‌లో 1 శాతం మేర వాటా ఉన్నది. వీటిలో మొత్తం పెట్టుబడుల విలువ రూ.70,000 కోట్లు. ఇవి కాకుండా ఇటీవల అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసిన అంబూజా సిమెంట్స్‌, ఏసీసీల్లో సైతం ఎల్‌ఐసీకి షేర్లున్నాయి. వీటి విలువ రూ. 10,000 కోట్లకుపైనే.

తాజాగా ఈ మొత్తం పెట్టుబడులే రెండ్రోజుల్లో 15 శాతానికి పైగా తరిగిపోవడమే కాదు…రానున్న రోజుల్లో మరింత పడిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ప్రధానితో సాన్నిహిత్యమే కారణం

దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది పాలసీదార్లు, దేశంలో మొత్తం మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తులకు సమానమైన ఆస్తులు కలిగిన ఎల్‌ఐసీ వ్యవస్థాగతంగా దేశానికి అతి ముఖ్యమైన సంస్థగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అటువంటి సంస్థ ప్రధానితో సాన్నిహిత్యం ఉన్న వ్యక్తికి చెందిన వాణిజ్య గ్రూప్‌లో ఇంతగా పెట్టుబడులు చేయడాన్ని ప్రశ్నిస్తున్నారు.ఈ గ్రూప్‌ షేర్లు రెండేండ్లుగా పెద్ద ర్యాలీలు జరుపుతున్నప్పటికీ వాటినుంచి చాలావరకూ దేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌ దూరంగానే ఉంటున్నాయని బ్లూంబర్గ్‌ ప్రచురించిన ఒక కథనంలో పేర్కొన్నది.

అమెరికా వాణిజ్యవేత్త ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లాను తలదన్నేలా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు గత ఐదేండ్లలో 1900 శాతం పెరిగింది. తాజాగా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీవో యాంకర్‌ ఇష్యూలో ఈ బుధవారం రూ.3,276 ధరకు ఎల్‌ఐసీ రూ.300 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. ఆ షేరు శుక్రవారానికల్లా రూ. 2,700 సమీపంలోనే మార్కెట్లో దొరుకుతున్నది. ఒకే ఒక్క ట్రేడింగ్‌ రోజులో ఎల్‌ఐసీ కొత్త పెట్టుబడి కాస్తా రూ.250 కోట్లకు తరిగిపోయింది.