DailyDose

విశాఖ.. రాజధానిపై దూకుడు పెంచిన జగన్ సర్కార్

విశాఖ.. రాజధానిపై దూకుడు పెంచిన జగన్ సర్కార్

రుషికొండపై దూకుడు పెంచిన ప్రభుత్వం

నిర్మాణ పనుల కోసం టెండర్ల ఆహ్వానం

రుషికొండపై ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్మిస్తున్న వేంగి బ్లాక్‌ పూర్తికి టెండర్లు ఆహ్వానించింది. ఫిబ్రవరి 3లోగా బిడ్ల దాఖలుకు అవకాశం ఇచ్చింది. ఈ నిర్మాణం సీఎం క్యాంపు కార్యాలయం కోసమనే అనుమానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే విశాఖ కేంద్రంగా పాలనంటూ కొందరూ మంత్రులు ఇటీవల చేస్తోన్న వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ-ఏపీటీడీసీ ఆధ్వర్యంలో విశాఖపట్నం రుషికొండ మీద రీడెవలప్‌మెంట్‌ హిల్‌ రిసార్టు పనులు వేగంగా సాగుతున్నాయి. 4 బ్లాకుల్లో నిర్మాణాలు చేపడుతుండగా త్వరలో ఒక బ్లాకును అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో విశాఖ నుంచే పాలన సాగుతుందని కొందరు మంత్రులు తరచూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రుషికొండపై పనులు వేగం పుంజుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మొత్తం ప్రాజెక్టు నిర్వహణకు కన్సల్టెన్సీని ఆహ్వానించిన ఏపీటీడీసీ తాజాగా వేంగి బ్లాక్‌ నిర్మాణానికి టెండర్లు పిలిచింది. ఆసక్తి ఉన్న కంపెనీలు ఫిబ్రవరి మూడో తేదీలోగా బిడ్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రుషికొండపై ఏం కడుతున్నారన్న విషయమై ముందునుంచే అనేక సందేహాలు నెలకొన్నాయి. సీఎం క్యాంపు కార్యాలయం కోసం కడుతున్నారని ముందు నుంచీ అనధికారికంగా అంటున్నారు. జీవీఎంసీకి ఏపీటీడీసీ సమర్పించిన ఆకృతుల్లో కార్యాలయాల అవసరాలకు వీలుగానే ప్లాన్లు సమర్పించారని చెబుతున్నారు. కొండ మీద మొత్తం 4 బ్లాకులుగా సముదాయాలను నిర్మించేందుకు ఏపీటీడీసీ అనుమతి కోరింది. వేంగి, గజపతి, కళింగ, విజయనగరం పేర్లతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వేంగి బ్లాకును 3 నెలల్లోగా పూర్తి చేయాలని టెండర్లు పిలిచింది. ఇందులో భవన నిర్మాణ తుదిదశ పనులు, విద్యుదీకరణ, నెట్‌వర్కింగ్‌ పనులతో పాటు కొండవాలు రక్షణ పనులు చేపట్టనున్నారు. జీవీఎంసీకి సమర్పించిన వివరాల ప్రకారం 1713.22 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ వేంగి బ్లాక్‌ను నిర్మించనున్నారు. కిచెన్‌, డార్మెటరీ భవనాలూ ఇందులో వస్తాయి.