Devotional

అత్యాచారం కేసులో.. ఆశారాంకు మరోసారి జీవితఖైదు

అత్యాచారం కేసులో.. ఆశారాంకు మరోసారి జీవితఖైదు

అహ్మదాబాద్‌: ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపూ (Asaram Bapu) మరో అత్యాచార కేసులో దోషిగా తేలారు. ఈ కేసులో ఆయనకు జీవితఖైదు విధిస్తూ గుజరాత్‌ (Gujarat) కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.

కాగా.. ఇప్పటికే ఆయన మరో రేప్‌ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు.

దాదాపు పదేళ్ల క్రితం నాటి అత్యాచారం కేసులో గాంధీనగర్‌ కోర్టు ఆశారాంను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. 2013లో గుజరాత్‌ మోతేరాలోని ఆశారాం బాపూ (Asaram Bapu) ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో తనపై ఆయన పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు సూరత్‌కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2001 నుంచి 2006 మధ్య ఆశారాం తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు..

ఈ కేసులో సుదీర్ఘ విచారణ విచారణ చేపట్టిన గాంధీనగర్‌ సెషన్స్‌ కోర్టు.. ఆశారాంను దోషిగా తేల్చుతూ నిన్న తీర్పు వెలువరించింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఆశారాం బాపూ భార్య సహా మిగిలిన ఆరుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నేడు ఆశారాంకు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా.. గతంలో జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఓ 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులోనూ ఆయన దోషిగా తేలారు. ఈ కేసులోనూ జీవితఖైదు పడటంతో 2018 నుంచి జోధ్‌పూర్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు..