Editorials

చైనా కొత్త ప్రధానిగా లీ కియాంగ్…జిన్ పింగ్ కు నమ్మిన బంటు పేరు

చైనా కొత్త ప్రధానిగా లీ కియాంగ్…జిన్ పింగ్ కు  నమ్మిన బంటు పేరు

మూడోసారి చైనా అధ్యక్షుడిగా షి జిన్ పింగ్ మరోసారి అధ్యక్ష బాధ్యతలను తీసుకున్నారు. శుక్రవారం ఆయన మరోసారి అత్యున్నత పదవిని అధిష్టించారు. తాజాగా శనివారం చైనా కొత్త ప్రధానిగా లీ కియాంగ్ ఎన్నికయ్యారు. చైనా నేషనల్ పీపుల్ కాంగ్రెస్ శనివారం లీ కియాంగ్ ను ప్రధానిగా నామినేట్ చేసింది. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాకు నామమాత్రం అధికారాలు కలిగిన ప్రధానిగా లీ కియాంగ్ ఉండనున్నారు. 69 ఏళ్ల కియాంగ్ చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ కు అత్యంత సన్నిహితుడు, నమ్మినబంటుగా పేరుంది.

గతేడాది షాంఘైలో అత్యంత కఠిన జీరో కోవిడ్ లాక్ డౌన్ అమలు చేసినందుకు లీ కియాంగ్ కారకుడు. ఈయన కారణంగా కమ్యూనిస్ట్ చైనా లో ప్రజలు తీవ్రంగా ఆందోళనలు చేశారు. జిన్ పింగ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. లీ కియాంగ్ టెక్నాలజీ, చైనా ఆర్థిక వ్యవస్థకు పవర్ హౌజ్ గా ఉన్న ఆగ్నేయ ప్రావిన్స్ జెజియాంగ్ కు చెందిన వారు. కోవిడ్ మహమ్మారి తర్వాత చైనా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించింది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే బాధ్యత లీ కియాంగ్ పై ఉంది. 1970 తర్వాత గతేడాది అతి తక్కువ వృద్ధి రేటును నమోదు చేసింది చైనా. కేవలం 3 శాతానికి పడిపోయింది. 1970 తర్వాత ఇదే రెండో వృద్ధి క్షీణత.
అంతకు ముందు రోజు చైనాకు మూడోసారి అధ్యక్షుడిగా షి జిన్ పింగ్ ఎన్నికయ్యారు. చైనా పార్లమెంట్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ శుక్రవారం దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మొత్తం 2952 మంది ఉన్న పార్లమెంట్ ఏకగ్రీవంగా జిన్ పింగ్ కు మద్దతు తెలిపింది. ఇదే సమయంలో జిన్ పింగ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న హన్ ఝెంగ్ దేశ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

తాజాగా లీ కచియాంగ్ నుంచి ప్రధాని బాధ్యతలను లీ కియాంగ్ తీసుకోనున్నారు. ప్రపంచంలో శక్తివంతమైన సైన్యంగా గుర్తింపు పొందిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి హెడ్ గా ఉండే సెంట్రల్ మిలిటరీ కమిషన్ కు కూడా అధ్యక్షుడు అయిన జిన్ పింగ్ చైర్మన్ గా ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రధాన కార్యదర్శిగా, చైనా అధ్యక్షుడిగా, చైనా మిలిటరీ కమిషన్ చైర్మన్ గా జిన్ పింగ్ ఉండనున్నారు. ఒక విధంగా చైనాకు అనధికార నియంతగా జిన్ పింగ్ చెలామణి అవుతున్నారు.