NRI-NRT

తానా ఎన్నికలపై కొనసాగుతున్న సందిగ్ధత..

తానా ఎన్నికలపై కొనసాగుతున్న సందిగ్ధత..
  • కోర్టు తీర్పు కోసం ఎదురుచూపు.
  • పోటా పోటీగా నామినేషన్లు..
  • వచ్చే 23వ తేదీ వరకు ఇదే పరిస్థితి..
  • ఆచితూచి అడుగులు వేస్తున్న ఎన్నికల అధికారులు.
  • చాప కింద నీరులా అభ్యర్థుల ప్రచారం..

తానా ఎన్నికలపై సందిగ్ధత కొనసాగుతోంది. నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఇరు వర్గాల వారు పోట పోటీగా నామినేషన్లు వేశారు. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? లేక వాయిదా పడతాయా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. వచ్చే 23వ తేదీన కోర్టు తీర్పు వెలువడుతుందని దాని ప్రకారం తదుపరి ఎన్నికల షెడ్యూల్ ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం తానాలో తుఫాను ముందు ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. నామినేషన్లు వేసిన వారు చాప కింద నీరులా ప్రచారాన్ని ప్రారంభించారు. తమ మద్దతుదారులను, వనరులను సమీకరించుకుంటున్నారు.

ప్రచారం ప్రారంభించిన గోగినేని.

తానా అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన గోగినేని శ్రీనివాస ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా సిలికాన్‌వ్యాలీలో పర్యటించారు. అక్కడ ఉన్న తానా పెద్దలు కోమటి జయరాం తదితరులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇతర కమ్యూనిటీ పెద్దలను, వివిధ సంఘాల వారిని గోగినేని కలుస్తున్నారు. డాలస్, వర్జీనియా, తన స్వస్థలం డెట్రాయిట్ తదితర ప్రాంతాల్లో గోగినేని ఎన్నికల ప్రచారం జరిపారు. గత ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలను సరిచేసుకునే ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు.

కోర్టు తీర్పు కోసం కొడాలి నరేన్ ఎదురుచూపు.

తానా అధ్యక్ష పదవికి మరో వైపు నామినేషన్ వేసిన నరేన్ కొడాలి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని ప్రారంభించారు. తానాలో కొత్తగా చేరిన 30వేల మందికి ఓటు హక్కు కల్పించడం కోసం నరేన్ రాత్రింబవళ్లు పోరాటం చేస్తున్నారు. కొత్త సభ్యులకు ఓటు హక్కు లభిస్తే తాను సునాయాసంగా గెలుస్తానని నరేన్ భావిస్తున్నారు. మరొకపక్క ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇస్తున్న అట్లాంటా బాస్‌ల సూచనలు, సలహాల మేరకు నరేన్ తన ప్రచార వ్యూహాన్ని తయారు చేసుకుంటున్నారు.

పరిస్థితులను గమనిస్తున్న ఎన్నికల సంఘం.

ప్రస్తుతం తానాలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎప్పటికప్పుడు తానా బోర్డు సూచనలు సలహాలను తీసుకుంటోంది. వివాదాలకు తావు లేకుండా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడం కోసం ఎన్నికల కమిటీ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం కూడా కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

కిలారు ముద్దుకృష్ణ
సీనియర్ జర్నలిస్ట్.