Business

స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లు నేడు భారీ నష్టాలతో సాగుతున్నాయి.

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు (మార్చి 16, గురువారం) స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల పవనాల మధ్య భారత ఈక్విటీ సూచీలు నెగెటివ్ గా ఓపెన్ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 91.86 పాయింట్లు కోల్పోయి 57,464 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 29.20 పాయింట్ల నష్టంతో 16,942.95 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు బుధవారం సెషన్‍లో పడిపోగా.. నేడు ఆసియా మార్కెట్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్ రంగంపై అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.

లాభాలు, నష్టాలు

సెషన్ ఓపెనింగ్‍లో హిందుస్థాన్ పెట్రోలియమ్, బీపీసీఎల్, అరబిందో ఫార్మా, శ్రీరామ్ ఫైనాన్స్, ఐఓసీ, టైటాన్ కంపెనీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ స్టాక్స్ ఎక్కువ లాభాలతో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. నేడు నష్టాలతో మొదలైన మదర్సన్, హిందాల్కో, హింద్ కాపర్, నాల్కో, వేదాంత, టాటా స్టీల్, సెయిల్ స్టాక్స్ టాప్ లూజర్లుగా ట్రేడ్ అవుతున్నాయి.

మళ్లీ పడిన అమెరికా మార్కెట్లు

ఒక్క రోజు లాభాల తర్వాత అమెరికా మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. తాజాగా క్రెడిట్ సూస్ బ్యాంక్‍పై కూడా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో నెగెటివ్ సెంటిమెంట్ మరింత పెరిగింది. బుధవారం సెషన్‍లో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 280.83 పాయింట్లు క్షీణించి 31,874.57 వద్ద ముగిసింది. ఎస్&పీ 500.. 27.36 పాయింట్లను కోల్పోయి 3,891.93 వద్ద స్థిరపడింది. నాస్‍డాక్ కంపోజైట్ సూచీ 5.90 పాయింట్ల స్వల్ప లాభంతో 11,434.05 వద్దకు చేరింది.

అమెరికా మార్కెట్లు మళ్లీ నెగెటివ్‍గా మారడంతో.. ఆ ప్రభావం ఆసియా-పసిఫిక్ మార్కెట్లపై ఎక్కువగానే పడింది. నేడు జపాన్‍లో నిక్కీ సూచీ, ఆస్టేలియా మార్కెట్ ఇండెక్స్ సుమారు 1 శాతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హాంగ్‍సెంగ్ సూచీ కూడా 1శాతానికిపైగా పతనమైంది.

మరింత తగ్గిన క్రూడ్ ఆయిల్

అంతర్జాతీయ మార్కెట్‍లో ముడి చమురు ధరల పతనం కొనసాగింది. 24 గంటల వ్యవధిలో క్రూడ్ ఆయిల్ 5 శాతం వరకు పడిపోయింది. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 73.69 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 2021 డిసెంబర్ తర్వాత క్రూడ్ ఈ ధరకు పడిపోవడం ఇదే తొలిసారి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.82.71 వద్ద ఉంది.