WorldWonders

బంగారు ఉసిరి కాయలు కురిసింది ఇక్కడే …

బంగారు ఉసిరి కాయలు కురిసింది ఇక్కడే …

కేరళలోని అగ్రహారాల్లో కనిపించే సాధారణ గృహాల్లానే అనిపిస్తుంది. కానీ, ఆ ఆవరణకో ఐతిహ్యం ఉంది. అక్కడే, ఆదిశంకరులు ఆశువుగా కనకధారాస్తోత్రం వల్లించారు. ఆదిలక్ష్మి ఆ భక్తికి మెచ్చి బంగారు ఉసిరికాయల వాన కురిపించింది.

పళం తోట్టం… అన్న పేరు కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో తొంభై శాతం మందికి తెలియదు. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న క్షేత్రం ఇది. పన్నెండు వందల సంవత్సరాల నాటి ఓ అపురూప ఘట్టానికి సాక్ష్యం ఆ గ్రామం. అద్వైత సిద్ధాంత రూపకర్త ఆదిశంకరుడు. ఆయన బ్రహ్మసూత్రాలకు, ఉపనిషత్తులకు, విష్ణు సహస్రనామానికి భాష్యం రచించారు. నృసింహ కరావలంబ స్తోత్రం, సుబ్రహ్మణ్య భుజంగం, అన్నపూర్ణాదేవి అష్టకం లాంటి ఎన్నో రచనలు అందించారు. దేశం నలుమూలలా పీఠాలను ఏర్పాటు చేశారు. ఈ కారణజన్ముడి జన్మస్ధలం కాలడి. పెరియార్‌ నదీ తీరంలోని కాలడికి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పళం తోట్టం. బాల్యంలోనే సన్యాసం స్వీకరించారు శంకరులు. సర్వసంగ పరిత్యాగి భిక్షాటన మీదే జీవించాలి. ఆ నియమం ప్రకారం… ఇంటింటికి వెళ్లి భిక్ష స్వీకరించేవారు. అలా ఒక రోజున ఓ ఇంటికి వెళ్ళారు.

ఆ ఇంట్లో వితంతువు ఉండేది. వంటింట్లో పిడికెడు గింజలైనా లేని పేదరికం ఆమెది. ఇల్లంతా వెదకగా.. ఒక ఎండు ఉసిరికాయ కనిపించింది. చిరుగుల చీరతో గడప దాటడానికి అభిమానం అడ్డొచ్చి… తలుపు చాటు నుంచే ఆ ఉసిరికాయను భిక్షాపాత్రలో వేసింది. ఆ దారిద్ర్యాన్ని చూసిన బాలశంకరుల గుండె బరువెక్కింది. ఆ ఆవేదన లోంచే ఇరవై నాలుగు శ్లోకాలుగా శ్రీలక్ష్మీస్తుతి రూపు దాల్చింది. ఆ స్తోత్రానికి సంతుష్టురాలైన సిరులతల్లి… ‘ఏం కావాలో కోరుకో నాయనా?’ అని అడిగింది. ‘ఈ పేదరాలి దారిద్ర్యాన్ని దూరం చేయమ్మా’ అంటూ అర్ధించాడు. అందుకు శ్రీదేవి అంగీకరించలేదు. ‘ఆమె తన గతజన్మల కర్మ ఫలం ఇంకా అనుభవించాల్సి ఉంది’ అని జవాబిచ్చింది. ‘తనకు తినడానికి లేకపోయినా, ఉన్న ఒక్క ఉసిరికాయనూ నాకు ఇచ్చేసింది. దాంతో ఆమె కర్మ పూర్తిగా తొలగిపోలేదా! పుణ్యం లభించలేదా?’’ అని ప్రశ్నించారు శంకరులు.

ఆ తర్కానికి సంతసించిన శ్రీమహాలక్ష్మి పేదరాలి ఇంట బంగారు ఉసిరి కాయల వర్షం కురిపించిందని ఐతిహ్యం. శంకరులు ఆశువుగా వల్లించిన శ్లోకాలే ‘కనకధారాస్తవం’గా (స్తోత్రం) పేరుపొందాయి. బంగారు ఉసిరి కాయల వాన కురిసిన ఆ ఇల్లు పళం తోట్టంలో ఉంది. దాన్నిప్పుడు ‘బంగారు ఇల్లు’ అని పిలుస్తారు. ఆ పేదరాలి వంశంవారు అక్కడే నివసిస్తున్నారు. కాకపోతే, ఆదిశంకరులు అనుగ్రహించినప్పటి భవనం కాలక్రమంలో శిథిలమైపోయింది. రెండు వందల యాభై సంవత్సరాల క్రితం దాన్ని పునర్నిర్మించారు. ఇంట్లోవారి దైనందిన కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా…. వరండాలోని శంకరాచార్యుల చిత్ర పటం వద్ద ధ్యానం చేసుకుంటారు సందర్శకులు. పక్కనే ఉన్న భువనేశ్వరీ దేవి ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు.

ప్రత్యేక ట్రస్టు…

‘పళం తోట్టం’ ప్రాధాన్యాన్నీ, ఆ ఇంటి ప్రశస్తిని అర్థం చేసుకున్న ఆధ్యాత్మిక సాధకులు ‘శ్రీ ఆదిశంకర కనకధారా స్మృతి ట్రస్టు’ను ఏర్పాటు చేశారు. ట్రస్టు ఆధ్వర్యంలో మహాలక్ష్మి, శంకరుల ఆలయాలు, యోగా కేంద్రం, ధ్యాన కేంద్రం, వృద్ధాశ్రమం, ఉచిత భోజనశాల, నక్షత్రవనం నిర్మించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతానికి ప్రధాన ద్వారం, ప్రార్థన మందిరం, భజన మండపం, ధ్యానకేంద్రం, ట్రస్టు కార్యాలయం పూర్తి అయ్యాయి. పళం తోట్టం చేరుకోవడం కాస్తంత కష్టమైన పనే. ఆలువా, కాలడి, కొచ్చిన్‌ (ఎర్నాకుళం), కొట్టాయంల నుంచి వెళ్లవచ్చు. వీటిలో ఆలువా మార్గమమే ఉత్తమం. ఆలువాకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది పళంతోట్టం. ఆలువా నుంచి కొలన ఛేరి వెళ్లే బస్సులు ఇక్కడ ఆగుతాయి. ప్రధాన కూడలి నుంచీ ‘స్వర్ణత్తమన’ వెళ్లాలంటే, రెండు కిలోమీటర్లు నడవాల్సిందే. వాహనాలు ఉండవు. ఒకటి మాత్రం నిజం. అక్కడికి చేరుకోగానే… యాత్రికులు అప్పటిదాకా పడ్డ శ్రమంతా మరచిపోతారు.

‘వందే వందారు మందారం
ఇందిరానంద కందలమ్‌
అమందానంద సందోహ
బంధురం సింధురాననమ్‌…’
అని తన్మయంగా కనకధారాస్తోత్రం చదువుకుంటారు. లక్ష్మీ కటాక్షంతో… బంగారు ఉసిరికాయల వాన కురుస్తున్న దృశ్యం మనోఫలకం ముందు ఆవిష్కృతం అవుతుంది.

శ్రీమాత్రే నమః 🙏🏻

🔹🔸🔹🔸🔹🔸