Business

అత్యంత సంపన్న భారతీయుడుగా మళ్లీ ముకేశ్ అంబానీ

అత్యంత సంపన్న భారతీయుడుగా మళ్లీ ముకేశ్ అంబానీ

స్టాక్‌ మార్కెట్‌ ఆటుపోట్లు సంపన్నుల జాతకాలనూ తిరగ రాస్తున్నాయి. మార్కెట్‌ మాయాజాలంతో నిన్న మొన్నటి వరకు 8,100 కోట్ల డాలర్ల తో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ..

ప్రపంచ కుబేరుల జాబితాలో 9వ స్థానం

హిండెన్‌బర్గ్‌ దెబ్బతో 23వ స్థానానికి గౌతమ్‌ అదానీ.. వారానికి రూ.3,000 కోట్లు కోల్పోయిన అదానీ

ఎం3ఎం హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ వెల్లడి

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ ఆటుపోట్లు సంపన్నుల జాతకాలనూ తిరగ రాస్తున్నాయి. మార్కెట్‌ మాయాజాలంతో నిన్న మొన్నటి వరకు 8,100 కోట్ల డాలర్ల తో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ.. ఇప్పుడు ఏకంగా 23వ స్థానానికి పడిపోయారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక పుణ్యమాని గత నెలన్నర రోజుల్లో అదానీ ఆస్తుల విలువ 60 శాతం తగ్గింది. దీంతో ఆయన ఆస్తుల విలువ 5,300 కోట్ల డాలర్లకు (సుమారు రూ.4.35 లక్షల కోట్లు) పడిపోయింది. హురున్‌ ఇండియా, ఎం3ఎం ఇండియా సంయుక్తంగా ‘ఎం3ఎం హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ -2023’ పేరుతో విడుదల చేసిన నివేదిక ఈ విషయం తెలిపింది. గత ఏడాది కాలంలో అదానీ సంపద వారానికి సగటున రూ.3,000 కోట్ల చొప్పు న తగ్గిందని ఆ నివేదిక పేర్కొంది.

మళ్లీ టాప్‌-10లో అంబానీ

ఇదే సమయంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధినేత ముకేశ్‌ అంబానీ ఆస్తుల విలువ 20 శాతం తగ్గింది. ఈ నెల 15 నాటికి ఆయన ఆస్తుల విలువ 8,200 కోట్ల డాలర్లకు (సుమారు రూ.6.76 లక్షల కోట్లు) చేరింది. అయినా అత్యంత సంపన్న భారతీయుడిగా ‘ఎం3ఎం హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ జాబితాలో ముకేశ్‌ అంబానీ తొమ్మిదో స్థానం సంపాదించారు. స్టాక్‌ మార్కెట్‌ ఆటుపోట్లతో ప్రస్తుతం వీరిద్దరి సంపద కొద్దిగా తరిగినా, పదేళ్ల క్రితంతో పోలిస్తే మాత్రం ఇద్దరి సంపద బారీగా పెరిగింది. అదానీ సంపద 1,225 శాతం పెరిగితే అంబానీ సంపద 356 శాతం పెరిగిందని హురున్‌ ఇంటర్నేషనల్‌ నివేదిక తెలిపింది.

దేశంలో 187 మంది బిలియనీర్లు

ప్రపంచంలోని పేద దేశాల్లో ఒకటైన.. మన దేశం 187 మంది బిలియనీర్లతో ‘ఎం3ఎం హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ జాబితాలో మూడో స్థానం సంపాదించింది. గత ఏడాదితో పోలిస్తే 15 మంది కొత్తగా ఈ జాబితాలో చేరారు. ప్రస్తుతం మన దేశంలోని 187 మంది బిలియనీర్లలో 10 మంది మహిళలు ఉన్నారు. ఇందులో ఐటీ రంగానికి చెందిన రాధా వెంబు 400 కోట్ల డాలర్ల ఆస్తులతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు.

చైనాతో పోలిస్తే తక్కువే

కమ్యూనిస్టు చైనాతో పోలిస్తే మన దేశంలో బిలియనీర్ల సంఖ్య తక్కువగానే ఉంది. ప్రస్తుతం మన దేశంలో ఉన్న 187 మంది బిలియనీర్లతో పోలిస్తే చైనాలో ఐదింతల ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆ దేశంలో ఉన్నంత మంది బిలియనీర్లు మరే దేశంలోనూ లేరు. ప్రవాస భారతీయుల్ని కూడా కలుపుకుంటే భారత బిలియనీర్ల సంఖ్య 217కు చేరుతుందని హురున్‌ ఇంటర్నేషనల్‌ తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల వద్ద ఉన్న మొత్తం సంపదలో ఐదు శాతం బారత బిలియనీర్ల వద్దే ఉంది. అమెరికా బిలియనీర్ల వద్ద అయితే 32 శాతం సంపద ఉంది.

ముంబైలోనే ఎక్కువ మంది

ప్రస్తుతం మన దేశంలోని 187 మంది బిలియనీర్లలో 66 మంది ముంబైలో నివసిస్తున్నారని హురున్‌ ఇంటర్నేషనల్‌ నివేదిక తెలిపింది. ఢిల్లీ (39), బెంగళూరు (21) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక రంగాల వారీగా చూస్తే 2,700 కోట్ల డాలర్ల సంపదతో పుణె కేంద్రంగా పనిచేసే సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ అధినేత సైరస్‌ పూనావాలా హెల్త్‌కేర్‌ రంగంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు.

అత్యధికంగా నష్టపోయిన బెజోస్‌

టెస్లా మార్కెట్‌ క్యాప్‌ గత ఏడాది కాలంలో 4,800 కోట్ల డాలర్లు తుడిచి పెట్టుకుపోయింది. అయినా ఆ సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ 15,700 కోట్ల డాలర్ల (సుమారు రూ.12.91 లక్షల కోట్లు) ఆస్తులతో హురున్‌ బిలియనీర్ల తాజా జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజో్‌సదీ ఇదే పరిస్థితి. గత ఏడాది కాలంలో గౌతమ్‌ అదానీ కంటే మస్క్‌, జెఫ్‌ బెజోస్‌ ఎక్కువగా నష్టపోయారు. మార్కెట్‌ ఆటుపోట్లతో గత ఏడాది కాలంలో బెజోస్‌ సంపద 7,000 కోట్ల డాలర్లు తగ్గింది. అయినా 11,800 కోట్ల డాలర్ల (సుమారు రూ.9.7 లక్షల కోట్లు) సంపదతో బెజోస్‌ తాజా హురున్‌ బిలియనీర్ల జాబితాలో రెండో స్థానం సంపాదించారు.

2023 ఎం3ఎం హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ జాబితాలోని భారతీయులు

పేరు సంపద ర్యాంక్‌

(కోట్ల డాలర్లు)

ముకేశ్‌ అంబానీ 8,200 09

గౌతమ్‌ అదానీ ఫ్యామిలీ 5,300 23

సైరస్‌ పూనావాలా 2,700 46

శివ్‌నాడార్‌ కుటుంబం 2,600 50

ఎల్‌ఎన్‌ మిట్టల్‌ 2,000 76

ఎస్‌పీ హిందూజా ఫ్యామిలీ 2,000 76

దిలీప్‌ సంఘ్వీ ఫ్యామిలీ 1,700 98

ఆర్‌కే దమానీ ఫ్యామిలీ 1,600 107

కేఎం బిర్లా ఫ్యామిలీ 1,400 135

ఉదయ్‌ కోటక్‌ 1,400 135