Health

శరీరంలో ఐరన్ లోపానికి ఈ కణాలే కారణం

శరీరంలో ఐరన్ లోపానికి ఈ కణాలే కారణం

ఐరన్ ను శరీరం సంగ్రహించ కుండా పేగుల్లోని కొన్ని రోగనిరోధక కణాలు అడ్డుకుంటున్నాయని ఆస్ట్రియా శాస్త్రవేత్తలు తేల్చారు. దీనివల్ల శరీరంలో రక్తహీనత ఉత్పన్నమవుతుందని వివరించారు.

దిల్లీ: ఐరనన్ను శరీరం సంగ్రహించ కుండా పేగుల్లోని కొన్ని రోగనిరోధక కణాలు అడ్డుకుంటున్నాయని ఆస్ట్రియా శాస్త్రవేత్తలు తేల్చారు. దీనివల్ల శరీరంలో రక్తహీనత ఉత్పన్నమవుతుందని వివరించారు. ఈ రుగ్మతకు కొత్త రకం చికిత్సలను తెరపైకి తీసుకురావడానికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపారు. సమతౌల్యంతో కూడిన ఐరన్ జీవక్రియ చాలా అవసరం. ఈ ధాతువు రక్తంలోని హీమోగ్లోబిన్ లో ముఖ్యమైన భాగం. ఎర్రరక్త కణాల్లోకి ఆక్సిజన్ను రవాణా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ధాతువు లోపిస్తే రక్తహీనత (ఎనీమియా) తలెత్తుతుంది. అనారోగ్యానికి కారణమవుతున్న ఐదు ప్రధానాంశాల్లో ఐరన్ లోపం కూడా ఒకటి. ప్రపంచ జనాభాలో 30 శాతం మందిని ఈ సమస్య పీడిస్తోంది. ముఖ్యంగా మహిళల్లో ఇది ఎక్కువ. పేగుల్లోని డియోడినమ్ లో ఐరన్ను శోషించుకునే ప్రక్రియను కొన్ని రకాల రోగ నిరోధక కణాలు నియంత్రిస్తాయని తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని మాక్రోఫేజెస్ అంటారు.

డ్యుయోడినమ్లో ఇవి నేరుగా క్రియాశీలం కావడం వల్ల శరీరంలో ఐరన్ లభ్యత తగ్గిపోతుందని తేల్చారు.ఐరన్ ను రవాణా చేసే ట్రాన్స్ఫరిన్ అనే రేణువులను ఈ మ్యాక్రోఫేజెస్ తినేస్తాయని గుర్తించారు. అందువల్ల ఆ ధాతువు రక్తప్రవాహంలో కలవలేదని చెప్పారు.