శ్రీశైల మహాక్షేత్రంలో మంగళవారం ఆరుద్రనక్షత్రం పురస్కరించుకుని లోకకల్యాణార్థం రుద్రవనంలోని రుద్రమూర్తికి దేవస్థానం విశేష పూజలను నిర్వహించింది. వైశాఖమాసంలో రుద్రవిగ్రహాన్ని నెలకొల్పడం కారణంగా ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో ఆరుద్రనక్షత్రం రోజున రుద్రమూర్తికి దేవస్థానం ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. పూజాకార్యక్రమంలో లోకక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకులు దేశం సుభిక్షంగా ఉండాలని సంకల్పాన్ని పఠించారు. తరువాత అర్చకులు రుద్రమంత్రాలను పఠిస్తుండగా శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ, గందోధకం, భస్మోదకం, పుష్పోదకం, బిల్వోదకం, సుగంధోదకాలతో, జలంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం రుద్రదేవుడికి బిల్వార్చనను జరిపి వివిధ పుష్పాలతో పుష్పార్చన చేశారు. రుద్రదేవుని చల్లని చూపు ఎల్లప్పుడూ కృష్ణానదిపై ప్రసరించడం వలన నందిలో నీరు సంమృద్ధిగా ఉండి, పంటలు బాగా పండుతాయని, అలాగే శ్రీశైలం ఆనకట్ట ఎల్లప్పుడూ పరిరక్షింపబడుతుందని పలువురు ఆధ్యాత్మికవేత్తలు సూచించడంతో ఆలయానికి ఈశాన్యభాగంలో కృష్ణానదిపై రుద్రుడి దృష్టి పడే విధంగా దేవస్థానం విగ్రహాన్ని నెలకొల్పింది. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న, సిబ్బంది పాల్గొన్నారు.