Devotional

ముగిసిన పునర్వసు దీక్ష భద్రాచలం…

ముగిసిన పునర్వసు దీక్ష భద్రాచలం…

భద్రాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం సంప్రదాయబద్దంగా శ్రీరామ పునర్వసు దీక్షను విరమణ కార్యక్రమం నిర్వహించారు. దీక్ష ముగింపు సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన శ్రీరామదీక్షితులతో భద్రాద్రి పురవీధులు రామనామ స్మరణతో మారు మోగాయి. వేకువజామునుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. అనంతరం రామాలయంలోని నిత్యకల్యాణ మండపం ఆవరణలో శ్రీరామదీక్షితులు దేవస్థానం అందజేసిన తిరువడి సామగ్రితో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తిరువడి ధారణ చేసి భద్రగిరి ప్రదక్షిణ నిర్వహించారు. గిరిప్రదక్షిణ అగ్రభాగాన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఏఈవో భవానీరామకృష్ణ స్వామివారి పాదాలను శిరస్సుపై ధరించి దేవస్థానం అర్చకులు, వేద పండితులు నడుస్తుండగా శ్రీరామదీక్షితులు వారిని అనుసరించారు. రామాలయం నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ కల్యాణ మండపం రోడ్డు, ఆర్డీవో కార్యాలయం, బ్రిడ్జిరోడ్డు, కూనవరం రోడ్డు, ఎల్‌ఐసీ రోడ్డు, తాతగుడి సెంటర్‌, రాజవీఽధి మీదుగా తిరిగి రామాలయానికి చేరుకొంది. చివరకు శ్రీరామదీక్షితులు తమ తిరువడిని భద్రుడి సన్నిధిలో సమర్పించారు.