Editorials

భక్తి ఎలా వుండాలి…….

భక్తి ఎలా వుండాలి…….

భగవంతుడు భావ ప్రియుడు మాత్రమే, బాహ్య ప్రియుడు కాదు, కానీ ఈరోజుల్లో మన భక్తి అంతా బాహ్యమైనదే, ఎంత అలంకరించామా, ఎన్ని వంటలు చేసామా, ఎంతమంది మనలను పోగిడారా అనే ఆలోచనే, ఇదంతా అహంకార భక్తి …
శ్రీకృష్ణుడి వద్దకు ఒకనాడు సత్యభామ బంగారు బుట్టలో కొన్ని ఫలములు తెచ్చి కృష్ణుని ముందుంచింది.
” స్వామీ ఇవి నా తోటలో పండిన పండ్లు, ఈ జాతి మరి ఎక్కడనూ లేదు” అని వాటిని గూర్చి గొప్పగా వర్ణించినది…
కృష్ణుడు ఒక తేలిక నవ్వు నవ్వి, ఒక పండును రుచి చూచి, ఇవి సారహీనములని చప్పరించి పడవేసెను,
ఇంతలో “గుబ్బి” అనుఒక గొల్లపిల్ల దోసిటలో కొన్ని పండ్లు తెచ్చి “స్వామీ!! ఇవి అల్ల నేరేడుపండ్లు,
స్వామి వలె శ్యామసుందరములు, అందువలన నాకు మిక్కిలి ప్రియములు”!!..
“దయతో గైకొని అనుగ్రహింపవలెను ” అనుచూ పాదముల మ్రోల వ్రాలినది…
కృష్ణుడు వాటి రుచిని అడుగడుగునా మెచ్చుకొనుచూ, అన్నియూ తిని వేసెను.
నిజానికి సత్యభామ ఇచ్చిన ఫలములు విలువ కలవి, రుచి కలవి…
ఐన నేమి ! ఆమె అహంభావము స్వాతిశయము మూలమున భగవానుని దృష్టి లో అవి రసహీనము లైనవి…
గోపిక స్వచ్ఛమైన ప్రేమ, అమాయకత్వము, అణుకువ మూలమున అవి భగవంతునికి అత్యంత ప్రియంకరములైనవి. అందుకు వాటినే స్వీకరించాడు ఆ దేవదేవుడు, దీనినిబట్టి మనం మన భక్తిని పునరావలోకనం చేసుకోవాలి, ఈరోజు భగవంతుడు మనము చేసే పూజలు, వ్రతాలు, దానాలు, ధర్మాలు ఎన్ని స్వీకరిస్తున్నారో మనకే అర్థం కావాలి