Politics

వైఎస్ వివేకా హత్య కేసు, ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు…

వైఎస్ వివేకా హత్య కేసు, ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు…

వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. మంగళవారం హైదరాబాద్ సీబీఐ ఆఫీసులో హాజరు కావాలని ఆదేశించింది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు హాజరు కావాలని ఆదేశించంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తేనే చాలా విషయాలు తెలుస్తాయని ఇప్పటికే సీబీఐ అధికారులు హైకోర్టుకు తెలిపారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగనిస్టే కూడా ఇవ్వలేదు. సీబీఐ తని తాను చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అరెస్టులకు ఎలాంటి ఆటంకాలు లేకపోయినప్పటికీ సీబీఐ ఇంకా .. అవినాష్ రెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా నోటీసులు జారీ చేయడంతో అరెస్టుపై మరోసారి ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.

ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టేసిన సీబీఐ కోర్టు

మరో వైపు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఉదయ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టి వేసింది. ఉదయ్ కుమార్ రెడ్డి విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు వివేకా హత్య కేసు డైరీని కోర్టుకు సమర్పించారు. వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. బెయిల్ పై బయటికొస్తే ఉదయ్ సాక్షులను ప్రభావితం చేస్తాడని తెలిపారు. వివేకా హత్య కేసులో ఉదయ్ ప్రమేయంపై ఆధారాలు సేకరించాకే అరెస్ట్ చేశామని సీబీఐ వెల్లడించింది. అంతేకాదు, వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ పునరుద్ఘాటించింది. హత్యకు కుట్ర, సాక్ష్యాల ధ్వంసంలో అవినాశ్ ప్రమేయం ఉందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది.

అవినాష్ రెడ్డిపై సీబీఐ కీలక ఆరోపణలు

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర పై ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు దృష్టికి కీలక అంశాలు తీసుకెళ్లింది. వివేకా హత్య కేసు వెనుక జరిగిన కుట్రలో ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఆయన ద్వారా తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది. అవినాష్ పాత్ర పైన ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసిందని వివరించింది. గుండెపోటు అంటూ హత్యను దాచిపెట్టటం, సాక్ష్యాల విధ్వంసం, కుట్రలో అవినాష్ భాగమైనట్లు తేలినప్పటికీ సమాధానాలు ఎగవేసి, తప్పుదోవ పట్టించారని వివరించింది. దీంతో కస్టోడియల్ విచారణ అవసరమని కోర్టుకు నివేదించింది. హత్యకు వినియోగించిన గొడ్డలి ఎక్కడ ఉందన్నది కస్డడీ లో తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది, హత్య తరువాత 2019 మార్చి 15వ తేదీ తెల్లవారు జామున 1.58 గంటలకు అవినాష్ ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నట్లు గుగూల్ టేక్ ఔట్ ద్వారా తేలిందని సీబీఐ కోర్టుకు వివరించింది. అవినాశ్‌ రెడ్డి పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయని… ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వరాదని సీబీఐ పేర్కొంది.

ఏడో సారి సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి

ఇప్పటికి ఆరు సార్లు ఎంపీ అవినాష్ సీబీఐ ముందు హాజరయ్యారు. మరోసారి విచారణకు హాజరయ్యారు. అరెస్ట్ చేస్తారా లేదా అన్నదానిపై ఇప్పటికే ఉత్కంఠ ఏర్పడిది. ఈ క్రమంలో సీబీఐ మరోసారి పిలవడం చర్చనీయాంశమవుతోంది.