Politics

జీ7 సదస్సుకు మోదీ.. కీలక దేశాలతో చర్చలు..

జీ7 సదస్సుకు మోదీ.. కీలక దేశాలతో చర్చలు..

జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లోని హిరోషిమా చేరుకున్నారు. జి7 సదస్సులో పాల్గొనడాకి ముందు ఆయన తీవ్రవాద అంశాన్ని ప్రధానంగా లేవనెత్తారు. పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండానే.. ఉగ్రవాద మూలాలపై భగ్గుమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉగ్రవాదం లేని అనుకూల వాతావరణాన్ని సృష్టించడం అత్యవసరం అని పేర్కొన్నారు. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఈ విషయాలు చెప్పారు.

ప్రధానంగా జీ7 సమ్మిట్‌లో ‘గ్లోబల్ సౌత్’ దేశాల వాయిస్‌ను, వారి ఆందోళనలను వినిపిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జీ20 దేశాల్లో సామరస్యాన్ని పెంపొందడంతో భారత్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. సౌత్ దేశాల వాయిస్‌ను జీ7 సమ్మిట్‌లో బలంగా వినిపిస్తానని ప్రతినబూనారు ప్రధాని. పైగా ఈ ఏడాది జీ20 మీటింగ్ మన దేశంలోనే జరుగనుంది. ఈ నేపథ్యంలోనే ఇంటర్వ్యూలో జీ20 దేశాలకు సంబంధించిన అంశాలు, సమస్యలపై తన వాయిస్‌ను రైజ్ చేశారు.

చైనాతో సరిహద్దు అంశాన్ని కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాలకు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత అవసరమని చెప్పారు. రెండు దేశాల భవిష్యత్తు అభివృద్ధి పరస్పర గౌరవం, పరస్పర సహకారం, శాంతి, పరస్పర ప్రయోజనాలపై మాత్రమే ఆధారపడి ఉంటుందన్నారు. సంబంధాలను ‘సాధారణీకరించడం’ ఇరు దేశాలకు, ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు.

అదే సమయంలో ప్రధాని మోదీ.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై భారతదేశం వైఖరిని స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరి చాలా స్పష్టంగా ఉందని, శాంతి వైపే భారత్ నిలుస్తుందని చెప్పారు. ఇది సంఘర్షణకు సమయం కాదని, పరస్పర సహకారానికి సమయం అన్నారు. రాబోవు రోజుల్లో ఈ వివాదం పరస్పర సహకారంతోనే ముగుస్తుందని చెప్పారు. ఇరు దేశాలతో తమ చర్చలు కొనసాగుతున్నాయన్నారు. ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడం సవాళ్లను ఎదుర్కొనే వారికి భారత్ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.

SCOలో భారత్ కీలక పాత్ర..
ఎస్‌సీఓలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారతదేశం ఎప్పుడూ భద్రతాపరమైన అంశాలతో పొత్తులు, సంబంధాలు పెట్టుకోలేదని పేర్కొన్నారు ప్రధాని. అయినప్పటికీ.. జాతీయ ప్రయోజనాల ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్నేహితులు, సమాన ఆలోచనలు గల భాగస్వాములతో కలిసిమెలిసి ఉంటామన్నారు. క్వాడ్ దేశాల సమిష్టి దృష్టి.. స్వేఛ్చాయుతమై, విశాలమైన, సంన్నమైన, సమ్మీళిత ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని ప్రోత్సహించడంపైనే ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. జీ7 సదస్సులో మిత్రదేశాలతో ప్రపంచ సవాళ్లపై ప్రధాని మోదీ చర్చించనున్నారు. మరో 4 రోజుల్లో మూడు దేశాల్లో ప్రధాని పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ.. G7, క్వాడ్, FIPIC సదస్సుల్లో పాల్గొననున్నారు.

.