Editorials

జ్యేష్ఠ మాసం ప్రారంభం , జ్యేష్ఠ మాసం విశిష్టత

జ్యేష్ఠ మాసం ప్రారంభం , జ్యేష్ఠ మాసం విశిష్టత

తెలుగువారు చంద్రమానం అనుసరిస్తారు కాబట్టి కొత్త ఏడాది ఛైత్రంతో ప్రారంభమై పాల్గుణంతో ముగుస్తుంది. తెలుగు నెలల్లో మూడోది జ్యేష్ఠం.
ఛైత్ర , వైశాఖం తర్వాత వచ్చే జ్యేష్ఠ మాస పుణ్య కాలంలో చేసే పూజలు , జపాలు , పారాయణాదులకు విశేష ఫలముంటుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. జ్యేష్ఠంలో విష్ణుసహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది. అలాగే ఈ మాసంలో జలదానం చేయడం చాలా ఉత్తమం. జ్యేష్ఠశుద్ద తదియనాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతి దేవిని పూజించడమే కాదు , దానాలకు శుభకాలం. ముఖ్యంగా అన్న దానం చేయడం ఉత్తమం.

జ్యేష్ఠశుద్ద దశమిని దశపాపహర దశమి అంటారు. అంటే పది రకాల పాపాలను పోగొట్టే దశమి అని అర్ధం. పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగా స్నానం , లేదా ఏదైనా నది లో పదిసార్లు మునకేస్తే మంచి ఫలితాన్నిస్తుంది. నల్ల నువ్వులు , నెయ్యి , పేలపిండి , బెల్లం నదిలో వేయాలి. అలాగే చేపలు , కప్పలు , తాబేలు లాంటి జలచరాల రజత ప్రతిమలను నీటిలో వదలడం విశేష పుణ్యదాయకం. ఈ రోజున ఇష్ట దైవాన్ని పూజించే , ఆలయాల సందర్శిస్తే శుభం జరుగుతుంది.

జ్యేష్ఠ శుద్ద ఏకాదశినే నిర్జల ఏకాదశి అనే పేరుతోనూ పిలుస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు , పాయసం , పానకం , నెయ్యి , గొడుగు దానం చేయాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే 12 ఏకాదశులను ఆచరించిన ఫలితం దక్కుతుంది. జ్యేష్ఠ శుద్ద ద్వాదశిని దశహరా అంటారు. ఇది దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి. ఈరోజు నది స్నానాలు చేయాలి. అలాంటి అవకాశంలేనప్పుడు ఇంట్లో స్నానమాచరించే సమయంలో గంగా దేవిని స్మరించడం ఉత్తమం. జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్టి అంటారు. ఈ రోజున తిలలు దానం చేసిన వారికి ఆశ్వమేథయాగం చేసిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ మాసంలో గొడుగు , చెప్పులు దానం చేసిన వారికి ఉత్తమగతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని విష్ణు పురాణం తెలిపింది. వామన ప్రీతికి విసనకర్ర , జల కలశం , మంచి గంధం దానం చేయాలి. ఈ పౌర్ణమినే ఏరువాక పున్నమి పేరుతో జరుపుకుంటారు. ఇది రైతుల పండుగ.. ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి , ఉరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దుక్కి దున్నిస్తారు.

జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత పదమూడో రోజున మహిళలు వటసావిత్రి వ్రతం చేసుకుంటారు. భర్తలు పది కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని మనసార కోరుకుంటూ ఈ పూజ చేస్తారు. జ్యేష్ఠ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి , సిద్ద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న పనులు నేరవేరుతాయి. జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రి ప్రదోష కాలంలో శివునికి అభిషేకం , బిల్వదళాలతో పూజిస్తే అకాల మృత‌్యుహరణం , యశస్సు కీర్తి , ఆరోగ్యం లభిస్తాయి.