Movies

అక్కినేని వర్సెస్ నందమూరి చివరికలా ముగింపు….

అక్కినేని వర్సెస్ నందమూరి చివరికలా ముగింపు….

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో నంద‌మూరి, అక్కినేని ఫ్యామిలీస్‌కి ఉండే గుర్తింపు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నంద‌మూరి తార‌క రామారావు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ఇద్ద‌రూ రెండు క‌ళ్లుగా నిలిచి ఇండ‌స్ట్రీ ఎదుగుద‌ల‌కు తోడ్ప‌డ్డారు. వారిద్ద‌రూ సినిమాల ప‌రంగా పోటీ ప‌డ్డారు. క‌లిసి న‌టించారు. అయితే గ‌త కొన్నాళ్లుగా నేటి త‌రం వార‌సుల్లో నంద‌మూరి బాల‌కృష్ణ‌, అక్కినేని నాగార్జున మ‌ధ్య తెలియ‌ని దూరం ఉంద‌నేది బ‌హిర్గ‌త‌మైన విష‌య‌మే. అలాగే రీసెంట్ టైమ్‌లో అయితే బాల‌కృష్ణ ఓ వేదిక‌పై మాట్లాడుతూ అక్కినేని తొక్కినేని అని కామెంట్ చేయ‌టం హాట్ టాపిక్‌గా మారింది. దానిపై నంద‌మూరి బాల‌కృష్ణ వివ‌ర‌ణ ఇచ్చారు. అలాగే అక్కినేని వార‌సులైన చైత‌న్య‌, అఖిల్ కూడా చెప్పారు. కానీ ఆ వివాదం త‌ర్వాత వీరిద్ద‌రూ ఎక్క‌డా క‌లుసుకున్న దాఖ‌లాలు లేవు. దీంతో ఈ రెండు కుటుంబాల న‌డుమ తెలియ‌ని వివాదం ర‌న్ అవుతుంద‌నే టాక్ వినిపిస్తూనే ఉంది.

అయితే ఈ వివాదానికి అక్కినేని నాగ చైత‌న్య ఫుల్ స్టాప్ పెట్టేశారు. శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుకుల‌కు నాగ చైత‌న్య ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ‘‘తెలుగు సినిమా ఇండ‌స్ట్రీని స్థాపించిన మూల స్తంభాల్లో ఎన్టీఆర్‌గారు ఒక‌రు. ఆయ‌న శ‌త జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొన‌టం నా అదృష్టం. ఆయ‌న అందం, వాక్ శుద్ధి, క్ర‌మ‌శిక్ష‌ణ గురించి నేను ప్ర‌త్యేకంగా మాట్లాడాల్సిన ప‌ని లేదు. ఆయ‌న చేసిన పౌరాణిక‌, చారిత్రాత్మ‌క‌, సామాజిక సినిమాలు గొప్పవి. ఎవ‌రైనా రాముడు, కృష్ణుడు అని మాట్లాడితే నాకు వెంట‌నే గుర్తుకు వ‌చ్చేది ఎన్టీఆర్‌గారే. ఆయ‌న గురించి తాత‌గారు ఎంతో గౌర‌వంగా మాట్లాడేవారు. వారి స్నేహం గురించి తెలిసిన‌ప్పుడు నాకెంతో ఇన్‌స్పైరింగ్‌గా అనిపించేది. ముఖ్య‌మంత్రిగా ఎన్టీఆర్‌గారు ప్ర‌జ‌ల‌కు ఎన్నో గొప్ప కార్య‌క్ర‌మాల‌ను చేశారు. ఒక న‌టుడుగా, ముఖ్య‌మంత్రిగా ఆయ‌న ప్ర‌జ‌ల గుండెల్లో దేవుడుగా నిలిచారు. ఈ అవ‌కాశం ఇచ్చిన చంద్ర‌బాబు నాయుడుగారికి, నంద‌మూరి బాల‌కృష్ణ‌గారికి, నందమూరి కుటుంబ స‌భ్యుల‌కు నా ధ‌న్య‌వాదాలు’’ అన్నారు.

ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌ల‌కు నాగార్జున అక్కినేని రాలేదు. కానీ.. త‌న త‌ర‌పున త‌న కొడుకు నాగ చైత‌న్య‌ను పంపించారు. ఆయ‌న స్టేజ్‌పై చాలా చ‌క్క‌గా మాట్లాడి నంద‌మూరి, అక్కినేని కుటుంబాల మ‌ధ్య వివాదం న‌డుస్తుంద‌నే వార్త‌ల‌కు చెక్ పెట్టారు.