తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కర్నూలు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అఖిలప్రియకు ఆరోగ్యం సరిగా లేదని ఆమె తరపు న్యాయవాదులు కోరడంతో జడ్జి బెయిల్ మంజూరు చేశారు. మరోవైపు విచారణ కోసం అఖిలప్రియను కస్టడీకి ఇవ్వాలని దాఖలు చేసిన పోలీసుల పిటిషన్ కోర్టు కొట్టివేసింది.
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా కొత్తపల్లి వద్ద టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అఖిలప్రియ దంపతులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
మరో వైపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆయన వెంట అడుగులో అడుగు వేశారు. తీరా తన నియోజకవర్గానికి పాదయాత్ర వచ్చే సరికి అఖిలప్రియ జైలు పాలయ్యారు. అఖిలప్రియ లేని కారణంగా ఆమె తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి తాత్కాలికంగా పార్టీ బాధ్యతల్ని తీసుకోని.. పాదయాత్రకు విజయవంతం చేశారు.
నిన్ననే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 41 రోజుల పాటు సాగిన లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా పూర్తయింది. ఆళ్లగడ్డ నియోజకవర్గం చిన్నకందుకూరు మీదుగా కడప జిల్లా సుద్దపల్లె గ్రామంలో ప్రవేశించారు.