Politics

సిద్ధరామయ్య సీఎంగా ఐదేళ్ల పదవీకాలం..

సిద్ధరామయ్య సీఎంగా ఐదేళ్ల పదవీకాలం..

కర్ణాటకలో అధికార పగ్గాలు చేపట్టి వారం రోజులు గడవక ముందే కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. పూర్తి కాలం (ఐదేళ్ల) సిద్ధరామయ్యే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతారంటూ ఆ రాష్ట్ర మంత్రి ఎం.బి.పాటిల్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక కాంగ్రెస్‌లో దుమారంరేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గానికి చెందిన నేతలను తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీతో అధికార పగ్గాలు హస్తగతం చేసుకోవడం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి ఎవరన్న విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటీ నెలకొంది. కొన్ని రోజుల ప్రతిష్టంభన తర్వాత సిద్ధరామయ్యను సీఎంగా ప్రకటించిన పార్టీ అధిష్టానం.. సీఎం ఎవరన్న ప్రతిష్టంభనకు తెరదించింది.

తొలి రెండేళ్లు సీఎంగా సిద్ధరామయ్య, ఆ తర్వాత మూడేళ్లు సీఎంగా డీకే శివకుమార్ పనిచేసేలా వారి మధ్య అధికార పంపిణీకి సంబంధించి పార్టీ పెద్దలు రాజీ కుదిర్చినట్లు కథనలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఐదేళ్లు సిద్ధరామయ్యే సీఎంగా పనిచేస్తారంటూ ఆయన వర్గానికి చెందిన మంత్రి ఎం.బి.పాటిల్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక కాంగ్రెస్‌లో దుమారంరేపుతున్నాయి. అయితే దీనిపై మాట్లాడేందుకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నిరాకరించారు. పవర్ షేరింగ్‌పై ఎవరేమన్నా తనకు అవసరం లేదన్నారు. దీనిపై తానేమీ మాట్లాడానని.. దీనిపై నిర్ణయించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జాతీయ నేతలు ఉన్నారని అన్నారు. తామిచ్చిన మాట ప్రకారం రాష్ట్రాభివృద్ధికే ప్రాధాన్యమిస్తామన్నారు.

అటు పాటిల్ వ్యాఖ్యలపై స్పందించేందుకు డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ నిరాకరించారు. పాటిల్ వ్యాఖ్యలకు తాను ధీటుగా సమాధానం ఇవ్వగలనని.. అయితే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా దీనిపై మాట్లాడబోనని అన్నారు. ప్రస్తుతానికి సిద్ధరామయ్య సీఎంగా ఉన్నారని.. అధికార పంపిణీపై ఏదైనా ఉంటే పార్టీ పెద్దలే చెబుతారని వ్యాఖ్యానించారు. మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధిష్టానంతో చర్చించేందుకు సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు.