NRI-NRT

కేటీఆర్ విదేశీ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం..

కేటీఆర్ విదేశీ  ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం..

మంత్రి కేటీఆర్ యూకే, యూఎస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా రెండు వారాల పాటు సాగిన కేటీఆర్ పర్యటన.. ఫలప్రదంగా ముగిసింది. ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్.. రెండు వారాల్లో రెండు దేశాల్లోని బడా బడా కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏకంగా 80కి పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. బ్యాంకింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఐటీ, మీడియా, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్, మెడికల్ డివైసెస్, డిజిటల్ సొల్యూషన్స్, ఇన్నోవేషన్ అండ్ డేటా సెంటర్ ఇలా పలు రంగాల్లో దూసుకెళ్తోన్న సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన కేటీఆర్.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఒప్పించారు. ఈ క్రమంలోనే పలు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ పర్యటనలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీల ద్వారా.. తెలంగాణలో డైరెక్టుగా 42 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. ఈ క్రమంలోనే టైర్-2 సిటీలైన నల్గొండ, కరీంనగర్, వరంగల్‌లో ఐటీ కంపెనీలను విస్తరించనున్నారు.

ప్రతిపాదిత పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 42,000 ఉద్యోగాలు వచ్చే అవకాశముండగా.. ఒక్కో ఉద్యోగం 3 నుంచి 4 పరోక్ష ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. పెటుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీల్లో గ్లోబల్ మీడియా పవర్ హౌస్ అయిన వార్నర్ బ్రదర్స్ డిస్నీ తెలంగాణలో మీడియా రంగంలోకి అడుగుపెట్టనుంది. హెల్త్‌కేర్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ అయిన మెడ్‌ట్రానిక్, ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అయిన స్టేట్ స్ట్రీట్, బెయిన్ క్యాపిటల్ యాజమాన్యంలోని VXI గ్లోబల్ సొల్యూషన్స్, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.

తెలంగాణకు సంబంధించిన ఇతర పెద్ద ప్రకటనలు స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్‌లో గ్లోబల్ లీడర్ అయిన DAZN, ఫ్రెంచ్ అమెరికన్ ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజం టెక్నిప్ FMC, గ్లోబల్ కన్సల్టింగ్ మరియు ఆర్థిక సంస్థ అయిన AlliantGroup, స్టెమ్ సెల్ థెరపీలో నిపుణుడు స్టెమ్‌క్యూర్స్, ప్రపంచంలోనే అతిపెద్ద B2B2C ట్రావెల్ మార్కెట్‌ ప్లేస్ మరియు టెక్నాలజీ ఇన్నోవేషన్ కంపెనీ Mondee, ప్రొడక్ట్ ఇంజినీరింగ్ మరియు సొల్యూషన్స్ కంపెనీ ZapCom గ్రూప్ పెట్టుబడులు పెట్టనున్నాయి.

ఈ పర్యటనలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ప్రపంచ గుర్తింపు దక్కింది. కాళేశ్వరానికి ఈ గుర్తింపు పొందడం చాలా గర్వంగా ఉందని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పర్యటన సూపర్ సక్సెస్ అయ్యేందుకు సహకరించిన తన బృందానికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.