Politics

పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ కు కోర్టులో ఊరట..

పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ కు కోర్టులో ఊరట..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట దక్కింది. పాస్‌పోర్ట్‌ విషయంలో రాహుల్‌కు అనుకూలంగా ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. మూడేళ్ల పాటు పాస్‌పోర్ట్‌ పొందేందుకు అనుమతించింది.

ప్రధాని ‘మోదీ ఇంటి పేరు’ వ్యాఖ్యల కేసులో గత మార్చిలో సూరత్‌ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుతో రాహుల్‌ తన ఎంపీ పదవిని కోల్పోయారు. ఇక ఎంపీ పదవిని కోల్పోయిన రాహుల్.. ఆ కోటాలో ఇచ్చిన డిప్లోమాటిక్ పాస్ పోర్ట్ సహా అన్ని రకాల ప్రయాణ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. దీంతో సాధారణ పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

అయితే, నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్‌ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో సాధారణ పాస్‌పోర్ట్‌ (Ordinary Passport)ను పొందేందుకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (NOC) తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మేరకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (NOC) ఇవ్వాలని ఢిల్లీ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాహుల్‌ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. నేడు విచారణ చేపట్టింది. అయితే రాహుల్‌ కోరినట్లు పదేళ్లకు కాకుండా మూడేళ్లకు మాత్రమే సాధారణ పాస్‌పోర్ట్‌ కోసం ఎన్‌వోసీ ఇస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.