Editorials

భగీరథ ప్రయత్నం అంటే ఏమిటో తెలుసా?

భగీరథ ప్రయత్నం  అంటే ఏమిటో తెలుసా?

ఈ నానుడి రామాయణ కథలలోని గంగవతరణం ఘట్టం నుండి వచ్చింది. ఎన్ని కష్టాలు ఎదురైన, నష్టాలు కలిగిన తాము అనుకున్నది సాధించేవరకు చేసే ప్రయత్నాన్నే భగీరథ ప్రయత్నం అంటారు. పట్టిన పట్టువదలక పట్టుదలగా చేసే ప్రయత్నమే భగీరథ ప్రయత్నం.
ఇక్ష్వాక వంశ చక్రవర్తి సగరుడు. ఇతడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు 60 వేలమంది కుమారులు. సగరుడు నూరు అశ్వమేధ యాగాలు చేసి ఇంద్రుడు పదవి పొందాలని ప్రయత్నినించాడు. తొంభైతొమ్మిది పూర్తి చేశాడు. చివరియాగం చేస్తుండగా ఇంద్రుడు తన పదవి కాపాడుకోవడం కోసం యాగ గుర్రాన్ని పాతాళ లోకంలో కపిల మహఋషి వద్ద దాచిపెట్టాడు. ఆ గుర్రం కోసం సగరుడి 60 వేల మంది పుత్రులు భూలోకమంత గాలించారు. చివరకు భూమిని త్రవ్వి పాతాళ లోకంలోకి వెళ్లారు. గుర్రాన్ని చూసారు. కపిల మహాఋషి ఆ గుర్రాన్ని అపహరించాడని భావించి అతనికి తపో భంగం కలిగించారు. మహాఋషి కళ్ళు తెరిచి బుడిదకమ్మని శపించాడు. 60 వేల మంది దగ్దమై బుడిదగా మారారు. నారదుడు ద్వారా ఈ విషయం సగరుడికి తెలిసింది. సగరుడు తన మనుమడు అంశుమతిని కపిలుడు వద్దకు పంపాడు. అతడు కపిలుడ్ని ప్రార్ధించి ప్రసన్నుడిని చేసుకుని గుర్రాన్ని తీసుకువచ్చాడు.
60 వేల మంది సగరుడు కుమారులకు స్వర్గ ప్రాప్తి కలగాలంటే గంగతో పాతాళ లోకంలో ఉన్న బుడిద తడవవలసి ఉంటుంది. అంశుమతుడు, అతని కుమారుడు దిలీపుడు గంగను తీసుకు రావడానికి ప్రయత్నం చేశారు. వారికి సాధ్యం కాలేదు. దిలీపుడు కుమారుడు భగీరథుడు అందుకు పూనుకున్నాడు. మొదట బ్రహ్మ కోసం తపస్సు చేసాడు. బ్రహ్మ అనుమతితో గంగ కోసం తపస్సు చేసాడు. గంగ ప్రత్యక్షమైంది. తాను రావడానికి సిద్ధమేనని ,తన దూకుడును భూమి భరించలేదని, దాన్ని అపగలిగేది శివుడు మాత్రమేనని చెప్పింది. వెంటనే శివుడి కోసం తపస్సు చేసాడు. గంగ ధారను ఆపటానికి శివుడు ఒప్పుకున్నాడు. గంగ దివి నుండి భువికి బయలుదేరింది. శివుడు తన జటాజూటంలో గంగను బంధించాడు. ఒక పాయను మాత్రం వదిలాడు. అది వేగంగా వెళుతూ జాహ్నవి మహాముని ఆశ్రమాన్ని ముంచెత్తింది. మహాముని కోపించి ఒక్క గుక్కలో గంగనంతా త్రాగేసాడు. భగీరథుడు తన కథనంతా మునికి చెప్పాడు. ముని శాంతించి తన చెవి రంద్రంలో నుండి ఒక చిన్న ధారగా గంగను వదిలాడు. ఆ ధార నేరుగా పాతాళ లోకం వెళ్ళింది. సగర కుమారుల భస్మాన్ని తడిపింది. వారికి స్వర్గ ప్రాప్తి లభించింది.
తన పూర్వీకుల కోసం భగీరథుడు పట్టినపట్టు విడవకుండా గంగను భూమిపైకి తెచ్చి పాతాళానికి పంపిన విదానంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాడు. చివరకు అనుకున్నది సాధించాడు. అప్పటి నుండి కష్టమైన కార్యంను సాధించినప్పుడు “భగీరథ ప్రయత్నం” తో సాధించాడనే నానుడి లోకంలో నిలిచిపోయింది.