NRI-NRT

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం….

ఉక్రెయిన్‌పై రష్యా  క్షిపణుల వర్షం….

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా సైన్యం మరోసారి విరుచుకుపడింది. సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో బాలిస్టిక్‌ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. రష్యా సైన్యం ప్రయోగించిన 11 బాలిస్టక్, క్రూయిజ్‌ క్షిపణులను తాము కూల్చివేశామని ఉక్రెయిన్‌ ఆర్మీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ప్రకటించారు. వాటి శకలాలు నగరంలో అక్కడక్కడా చెల్లాచెదురుగా పడిపోయాయని, దట్టమైన పొగ కమ్ముకుందని చెప్పారు. రష్యా దాడుల్లో కీవ్‌లో ఒకరు గాయపడినట్లు సమాచారం. రష్యా సేనలు తొలుత ఆదివారం రాత్రి దాడులు ప్రారంభించాయి.

జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొందరు అండర్‌గ్రౌండ్‌ రైల్వే స్టేషన్లలో తలదాచుకున్నారు. కొంత విరామం తర్వాత సోమవారం ఉదయం మళ్లీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. రష్యా క్షిపణి దాడుల నేపథ్యంలో చిన్నారులు భయాందోళనలతో బాంబు షెల్టర్‌ వైపు పరుగులు తీస్తున్న వీడియోను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఉక్రెయిన్‌ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని లాంగ్‌–రేంజ్‌ మిస్సైళ్లు ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ దాడుల్లో ఉక్రెయిన్‌కు చెందిన కమాండ్‌ పోస్టులు, రాడార్లు, ఆయుధాలు ధ్వంసమయ్యాయని పేర్కొంది.
కీవ్‌లో క్షిపణుల దాడి భయంతో మెట్రో స్టేషన్‌లో దాక్కున్న స్థానికులు