Politics

అక్టోబర్ నాటికి ఏపి అసెంబ్లీ రద్దు?

అక్టోబర్ నాటికి ఏపి అసెంబ్లీ రద్దు?

టీడీపీ ముందస్తు మేనిఫెస్టో ఉద్దేశం అదే

అమరావతి : ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ సహా ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ కసరత్తు మొదలు పెట్టనుంది.
ఇప్పటికే త్రిపుర, నాగాలాండ్, మణిపూర్‌, కర్ణాటకల్లో వేర్వేరు విడతల్లో ఈ ప్రక్రియ ముగిసింది. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి.

అదే సమయంలో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాల లేకపోలేదనే ప్రచారం ఊపందుకుంటోంది. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ముందస్తు ఎన్నికల అంశంపై తెరమీదికి వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మధ్యంతర ఎన్నికలకు వెళ్లొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి అసెంబ్లీని రద్దు చేయాలనే యోచనలో వైఎస్ జగన్ ఉన్నారని తెలుస్తోంది.

నిజానికి- షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే వచ్చే ఏడాది సార్వత్రికంతో పాటే ఏపీ అసెంబ్లీకీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. దీనికి భిన్నంగా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావొచ్చని చెబుతున్నారు. ఆరు నెలలుగా ముందుగానే వైఎస్ జగన్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ దూకుడుకు కళ్లెం వేయడంలో భాగంగా మధ్యంతరం వైపునకే మొగ్గు చూపుతారని అంచనా వేస్తోన్నారు.

దీనికి సంబంధించిన ఓ ప్రత్యేక కథనాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెందిన మీడియా సంస్థ ప్రచురించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ముందుగానే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడానికి కారణం కూడా అదేనని చెబుతున్నారు. మహానాడు వేదికగా చంద్రబాబు మేనిఫెస్టోను ప్రకటించడానికి కారణం అదేనని సమాచారం.

షెడ్యూల్ ప్రకారం జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 నెలల వరకు గడువు ఉన్నప్పటికీ- ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతోనే చంద్రబాబు హడావుడిగా మేనిఫెస్టోను ప్రకటించారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇటీవలే వైఎస్ జగన్ చేపట్టిన ఢిల్లీ పర్యటనలో కూడా ఈ విషయాన్ని ఆయన బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించారని అంటున్నారు.

ప్రస్తుతం వైఎస్ జగన్.. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తోన్నారు. ఫలితంగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ లోటు మొత్తం 10,000 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసిందని, ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఏపీని బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా ఆదుకుందనే వాదనలూ లేకపోలేదు.