Business

ఆంధ్రజ్యోతి, మహా టీవీపై హైకోర్టు ఆగ్రహం..

ఆంధ్రజ్యోతి, మహా టీవీపై హైకోర్టు ఆగ్రహం..

ఆ చానళ్లు తన ప్రతిష్ఠకు భంగం కలిగించాయన్న తెలంగాణా జస్టిస్‌ లక్ష్మణ్‌
(టివి గోవింద రావు)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న తీరును తప్పుపడుతూ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, మహాటీవీ చానళ్లలో చర్చా కార్యక్రమాలను నిర్వహించడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న తీరును తప్పుపడుతూ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, మహాటీవీ చానళ్లలో చర్చా కార్యక్రమాలను నిర్వహించడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ చర్చా కార్యక్రమాలు తన ప్రతిష్ఠకు భంగం కలిగించాయని జస్టిస్‌ లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ఆ ప్రసారాలకు సంబంధించిన వీడియోలను డౌన్‌లోడ్‌ చేసి ప్రధాన న్యాయమూర్తికి నివేదించాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. మీడియాకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నప్పటికీ అది ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా ఉండాలని, అంతేతప్ప, నిరాధార ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు.

చర్చల పేరుతో ఇతరుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించకూడదని స్పష్టం చేశారు. ఆ చానెళ్ల చర్చల్లో తనపై చేసిన కామెంట్లు తీవ్రంగా బాధించడంతో ఒక దశలో విచారణ నుంచి వైదొలగాలని భావించానని, అయినా సుప్రీంకోర్టు ఆదేశాలతోపాటు న్యాయవ్యవస్థపై ఉన్న గౌరవంతో విచారణ కొనసాగించానని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తికి డబ్బు సంచులు వెళ్లాయంటూ సస్పెండైన ఓ జడ్జి ఎలా వ్యాఖ్యానిస్తారని ప్రశ్నించారు. మరో వ్యక్తి ‘చెయ్యండ్రా’ అంటూ అసభ్య పదజాలాన్ని వినియోగించడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని అన్నారు. ఇది కచ్చితంగా కోర్టు ధికరణ కిందికే వస్తుందని, వారిపై చర్యలు తీసుకోవాలా? వద్దా? అన్నది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే నిర్ణయిస్తారని జస్టిస్‌ లక్ష్మణ్‌ పేరొన్నారు.