ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డా.. వైఎస్సార్ కడప జిల్లాలో తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూకుడు చూపిస్తున్నాడు. సీఎం జగన్ కంచుకోటలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు వినూత్నంగా ప్రచారం చేపట్టారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పాదయాత్రలో ఆ పార్టీ శ్రేణులు వివేకా హత్యకు సంబంధించిన పోస్టర్లు, ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ చేశారు. వివేకానందరెడ్డిని ఎవరు చంపారంటూ.. వైఎస్ వివేకా, సీఎం జగన్, కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఫొటోలను ప్రదర్శిస్తూ ‘బాబాయిని ఎవరు చంపారు?’ అని రాసి ఉన్న పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు
‘బాబాయిని ఎవరు చంపారు?’ అనే నినాదాలతో లోకేష్ పాదయాత్ర పొడవునా ర్యాలీగా వెళ్లారు. నారా లోకేష్ కూడా ప్లకార్డులు పట్టుకొని పాదయాత్ర వెంట ప్రజలకు చూపించారు. ప్రొద్దుటూరు టౌన్‌లో ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ ప్లకార్డులు ప్రజలకి చూపించి బాబాయ్‌ని చంపింది ఎవరు? అంటూ లోకేశ్ స్థానిక ప్రజలను అడిగారు. ఓ సందర్భంలో ఆ పోస్టర్లను పోలీసులు లాక్కోవడంతో తెలుగు దేశం పార్టీ నాయకులు అభ్యంతరం తెలిపారు. దీంతో పోలీసులతో ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలోనే వందల సంఖ్యలో ప్లకార్డులు పట్టుకొని కార్యకర్తలు పాదయాత్రలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్ర సాగుతున్న దారి వెంట టీడీపీ ప్లెక్సీలకు పోటీగా వైసీపీ ఫ్లెక్సీలు, చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేశారని తెలుగుదేశం నేతలు పోలీసులను ప్రశ్నించారు. పాదయాత్ర పొడవున భారీ సంఖ్యలో యువత, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.