Politics

పొత్తుల గురించి చర్చిస్తున్న బాబు, పవన్ కళ్యాణ్…

పొత్తుల గురించి చర్చిస్తున్న  బాబు, పవన్ కళ్యాణ్…

వారి నిర్ణయం మేరకే పొత్తులన్న టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్

లోకేష్ పాదయాత్రకు, బాబు సభలకు వస్తున్న అనూహ్య స్పందన చూసి కొంప కొల్లేరు అవుతుందేమోనని ముందస్తు ఎన్నికలకు జగన్ వెళ్లే ఛాన్స్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో బిజెపికి పొత్తు ఉంటుందని నేను అనుకోవడం లేదు

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అప్రూవర్ గా మారిన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన నిందితుడు శరత్ చంద్రారెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ద్రోహం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి

కే ఏ పాల్, జగన్మోహన్ రెడ్డి ది డెడ్లీ కాంబినేషన్

కోర్టు తీర్పును సహేతుకంగా విశ్లేషిస్తే తప్పేమీ లేదు

విచారణ అధికారినే కేసులు పెట్టి బెదిరిస్తే… సాక్షులు భయపడరా?

పార్టీలో ఉంచుకుంటే గౌరవించండి… లేకపోతే నేను పది రెట్లు అగౌరవపరచగలను

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

రానున్న ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తుల గురించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరుగుతున్నాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విస్పష్టం చేశారు. ఇద్దరి నిర్ణయం మేరకే పొత్తు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆ రెండు పార్టీల కలయికతో ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడుతుందని ప్రజలు భావిస్తున్నారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తెలిపారు. యువ గళం పాదయాత్రలో భాగంగా జమ్మలమడుగులో నారా లోకేష్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సభలకు అనూహ్య ప్రజాదరణ లభిస్తుండగా, మరొకవైపు లోకేష్ పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. టిడిపి నిర్వహిస్తున్న కార్యక్రమాలకు లభిస్తున్న ప్రజాదరణను చూసి కొంప కొల్లేరు అవుతుందేమోనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్తారేమోనని ఆయన అన్నారు. గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… టిడిపి నేతలు నిర్వహిస్తున్న సభలకు ప్రజలు బ్రహ్మరథం పట్టడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కలవర పడుతున్నాను. కడప జిల్లా ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు. అందుకే జమ్మలమడుగులో నారా లోకేష్ పాదయాత్రకు అపూర్వ స్వాగతాన్ని పలికారు. గతంలో ఎన్టీ రామారావు జమ్మలమడుగు లో పర్యటించినప్పుడు మేడలు మిద్దలు ఎక్కి చూసిన ప్రజలు, మరొకసారి ఆయన మనవడిని చూసేందుకు మేడలు, మిద్దెలు ఎక్కారు. కడప జిల్లాలో లోకేష్ కు లభిస్తున్న ప్రజాదరణ చూస్తుంటే మా పార్టీ పునాదులు కదిలి పోయే ప్రమాదం ఉన్నట్లు స్పష్టం అవుతుంది. గతంలో తరచూ వినిపించే సింహం సింగిల్ గా వస్తుందన్న డైలాగ్, ఇప్పుడు వినిపించడం లేదు. కే ఏ పాల్ తో కలిసి సింహం వస్తుందేమో చూడాలన్నారు.

ప్రధాని మోడీ నిష్కలంకమైన నాయకుడఅయితే… దానికి పూర్తిగా భిన్నం జగన్మోహన్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోడీ నిష్కలంకమైన నాయకుడు అయితే, దానికి పూర్తి భిన్నమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఎన్డీఏ కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరనున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఇదే తరహా ఊహాగానాలు వినిపించాయి. ఎన్డీఏ కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరడమే కాకుండా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్థానంలో మా పార్టీకి చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి పదవి బాధ్యతలను చేపట్టనున్నారన్న కథనాలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే మా పార్టీని, బిజెపి నాయకులు పురుగును చూసినట్లుగా చూస్తారు. ఎన్డీఏ కూటమిలోకి నేరుగా మా పార్టీని తీసుకుంటారా? అని ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, తనకైతే అనుమానంగా ఉందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో, బిజెపికి పొత్తు ఉంటుందని నేను భావించడం లేదు. అయితే పొత్తుల గురించి ఒక స్థాయిలో చర్చలు జరిగితే జరిగి ఉండవచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తో పాటు, ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సహకరించాలని జగన్మోహన్ రెడ్డి, బిజెపి నాయకత్వాన్ని కోరి ఉంటారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన శరత్ చంద్ర రెడ్డి అప్రూవర్ గా మారుతారని ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది నిజమైనప్పుడు, పొత్తుల గురించి ఆంధ్రజ్యోతి రాసిన వార్త కూడా నిజమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎన్ డి ఏ కూటమిలో చేరి కేంద్ర క్యాబినెట్లో మంత్రి పదవులను తీసుకోవాలని ఒకప్పుడు భావించారు. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగితే బిజెపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తాయా ?, అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యంగా అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్, ప్రస్తుతం బిజెపితో పొత్తును కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని బిజెపి రాష్ట్ర నాయకత్వం తరచూ గుర్తు చేస్తూ ఉంది. రాష్ట్ర నేతల వైపు కన్నెత్తి చూడని, పల్లెత్తు మాట మాట్లాడని పవన్ కళ్యాణ్, బిజెపి జాతీయ నాయకత్వంతో సన్నిహితంగానే మెలుగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆయన్ని పిలిపించుకొని మాట్లాడారు. పార్టీతో ప్రమేయం లేకుండా, మోడీతో ఉన్న స్నేహాన్ని ఆయన కొనసాగించవచ్చు. ఒకవేళ బిజెపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలి అనుకుంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముక్త ఆంధ్ర ప్రదేశ్ కోసం పవన్ కళ్యాణ్ తన పోరాటాన్ని యధావిధిగా కొనసాగించే అవకాశం ఉంది అని రఘురామకృష్ణం రాజు అన్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉన్నట్లుగా సాక్షి దినపత్రికలో కథనం

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉన్నట్లుగా సాక్షి దినపత్రికలో కథనాన్ని రాశారు. ఈ కేసులో కీలక నిందితుడిగా అరెస్ట్ అయి, బెయిల్ పొందిన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. శరత్ చంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కాకినాడ ఎస్ఇజెడ్, కాకినాడ పోర్టులో అత్యధిక వాటా శరత్ చంద్రారెడ్డి కి చెందిన కంపెనీలదే. ఆడాన్ డిస్టలరీస్ పేరిట రాష్ట్రంలో అధికమద్యాన్ని విక్రయిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడైన విజయసాయిరెడ్డి అల్లుడి అన్న నే ఈ శరత్ చంద్రారెడ్డి. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారబోతున్నారని ఆంధ్రజ్యోతి దినపత్రిక రెండు రోజుల క్రితమే వార్తా కథనాన్ని రాసింది. ఆంధ్రజ్యోతిలో చెప్పినట్టుగానే సిబిఐ కోర్టులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. నిందితులే ఏ కేసులోనైనా అప్రూవర్ గా మారాలంటే మారవచ్చు. సాక్షులు అప్రూవర్ గా మారరు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో నిందితుడైన దస్తగిరి అప్రూవర్ గా మారితే జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లు అభ్యంతరం వ్యక్తం చేయడం ఆశ్చర్యకరంగా ఉంది. ఢిల్లీ మద్యం కేసులో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి జైల్లో పెట్టాలని ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేస్తే, శరత్ చంద్రారెడ్డిని అరెస్టు చేస్తారా?. చేయరు కదా . అలాగే అప్రూవర్ గా మారినా దస్తగిరి కి కూడా బెయిల్ ఇచ్చి, బయట తిరిగే స్వేచ్ఛను కల్పించారు. ఈ రెండు కేసులు వేరు వేరైనా, వాటి మధ్యనున్న సారుప్యాన్ని మాత్రమే పరిశీలించాలని రఘురామకృష్ణంరాజు కోరారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కొందరి పేర్లు చెప్పాలని అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డికి సూచించినట్లు తెలిసిందన్నారు.

నమ్మిన స్నేహితులను మోసగించిన జగన్మోహన్ రెడ్డి

హైదరాబాదు నుంచి నన్ను ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అపహరించి, అరెస్టు చేయడానికి కొంతమంది తెలంగాణ నాయకులు జగన్మోహన్ రెడ్డికి సహకరించారు. నూటికి నూరు శాతం తనకు సహకరించిన స్నేహితులను జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విస్తృత కుట్ర కుంభకోణంలో కీలక వ్యక్తి పేరు రాకుండా ఉండాలంటే, మద్యం కుంభకోణంలో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి కొన్ని పేర్లు చెబితే ఊరట కల్పిస్తామని అన్నట్లుగా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. మద్యం కుంభకోణం కేసులో గా శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా
మారుతారని పత్రికల్లో రాసినట్టుగానే, ఆయన అప్రూవర్ గా మారడం నిజమే అయినప్పుడు, శరత్ చంద్రారెడ్డి కొన్ని పేర్లను చెబితే వైఎస్ వివేక హత్య కేసు విస్తృత కుట్ర కుంభకోణంలో నుంచి కీలక వ్యక్తి పేరు రాకుండా చేస్తామని చెప్పినట్లుగా వచ్చిన వార్త కథనాలను కూడా నమ్మాల్సి వస్తుంది. దీనితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను జగన్మోహన్ రెడ్డి మోసగిస్తున్నారని అర్థం అవుతుంది. ఇది పక్కా ఆధారాలతో చెప్పడం లేదు. సగం నిజం అయినప్పుడు, మిగతాది కూడా నిజమే అవుతుందని నమ్మాల్సిందే. ఎవరో చెప్పారని సంబంధం ఉందో లేదో తెలియని వ్యక్తి పేరైతే చెప్పలేరు. అలా చెప్పడం అనేది మిత్ర ద్రోహం అవుతుంది. ద్రోహం చేయడంలో పీహెచ్డీ చేశారు. గత ఎన్నికల్లో మా పార్టీ నెగ్గడానికి కెసిఆర్ ఎంతో సహకరించారని వాదనలు ఉన్నాయి. వ్యక్తిగతంగా కెసిఆర్ అంటే నాకు అభిమానం. పార్టీ పరంగా కాదు. ఆయనకు ద్రోహం చేయడం బాధ కలిగించే అంశం. ఢిల్లీ మద్యం కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డి ఎవరెవరి పేర్లను చెబుతారో, దాని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలన్నారు.

ప్రవర్చన కర్త కాకుండా కే ఏ పాల్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి అయి ఉంటే అవినాష్ రెడ్డికి యావత్ జీవిత ముందస్తు బెయిల్ ఇచ్చి ఉండేవాడు

ప్రవర్చన కర్త కాకుండా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి అయి ఉంటే కే ఏ పాల్, వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి యావత్ జీవిత ముందస్తు బెయిలు ఇచ్చి ఉండేవారు. హైకోర్టులో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరుగుతున్నప్పుడు కే ఏ పాల్ అక్కడకు వెళ్లి ప్రార్థనలను చేశారట. హైకోర్టు తీర్పు అనంతరం ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. కే ఏ పాల్ ప్రార్ధనల వల్లే ఈ తరహా తీర్పు వచ్చిందని భావించాలని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీకి పెద్దగా క్యాడర్ లేదు. కేఏ పాల్ పాపులర్ వ్యక్తి. అయినా ఆయన్ని కొంతమంది గతంలో అన్ పాపులర్ చేయాలని చూశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ని తాను శపించడం వల్లే, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని గతంలో కేఏ పాల్ చెప్పారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కూడా కేఏ పాల్ శపించినప్పటికీ, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డికి, కే ఏ పాల్ చేరువ కావడంతో ఇప్పుడు సాక్షి మీడియా ఆయనకు అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. గతంలో జరిగిన సంఘటనలను మనసులో పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డికి కె ఏ పాల్ చేరువయ్యారు. ప్రజాశాంతి పార్టీని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే, పాల్ తన ఆశీర్వాదంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను, ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులుగా భావించి గెలిపించుకుంటారు. బ్రదర్ అనిల్ ప్రచారం చేయడంవల్ల గత ఎన్నికల్లో కొంత ఓటు బ్యాంకు మా పార్టీకి నమోదయింది. ఇప్పుడు ఆయన దూరం కావడంతో ఆ ఓటు బ్యాంకు ను కేఏ పాల్ ద్వారా సాధించవచ్చునని మా పార్టీ నాయకత్వం ఆశాభావం గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో సొమ్ము ఎక్కువైందని కే ఏ పాల్ చెబుతున్నారు. ధనిక దేశాల నుంచి డబ్బును తీసుకువచ్చి కే ఏ పాల్, జగన్మోహన్ రెడ్డికి ఇస్తే, ఆయన ఆ డబ్బును ఖర్చు చేస్తారు. వీరిద్దరిది డెడ్లీ కాంబినేషన్ అంటూ ఎద్దేవా చేశారు.

హైకోర్టు తీర్పు కాపీ చదువుతుంటే… ఇంగ్లీషులో సాక్షి పేపర్ చదివినట్టుగా ఉంది

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరీ చేసిన తీర్పు కాపీ చదువుతుంటే, ఇంగ్లీషులో సాక్షి దినపత్రిక చదివినట్టుగానే ఉందని రఘు రామకృష్ణంరాజు తెలిపారు. తీర్పు అనంతరం న్యాయమూర్తిని వ్యక్తిగతంగా పల్లెత్తు మాట అనడానికి వీలు లేదు. అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. కానీ తీర్పు తప్పొప్పులను సహేతుకంగా విశ్లేషిస్తే తప్పు లేదు. నేను గతంలోనూ ఇదే నియమాలను పాటించాను. ఇప్పుడు పాటిస్తున్నాను. అయితే తీర్పు కాపీ చదువుతుంటే, నాకు ఇంగ్లీషులో సాక్షి దినపత్రిక చదివినట్లే అనిపించింది. సాక్షి దినపత్రికలో చేసిన అభియోగాలే, అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన విషయాలు తీర్పు కాపీలో రిపీట్ అయ్యాయి. ఇరువర్గాలు కోర్టు దృష్టికి తీసుకువచ్చిన విషయాలను తీర్పు కాపీలో ప్రస్తావిస్తారు. కానీ సాక్షి మీడియా లో మాత్రం తీర్పు కాపీ మొత్తం న్యాయమూర్తి చెప్పినట్టుగా పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ఇది సరైన వాదన కాదు. బెయిల్ ఇవ్వడం అనేది న్యాయమూర్తి విచక్షణ అధికారం. దాన్ని ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదు. అయితే హైకోర్టు తీర్పు ప్రభావం కింది కోర్టులలో ఉంటుంది. ఈ తీర్పును, న్యాయవాదులు ప్రస్తావించి హత్య కేసులలో నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని కోరే అవకాశాలు ఉన్నాయన్నారు.

విచారణ అధికారి పై కేసులు పెట్టారు

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ అధికారి రామ్ సింగ్ పై నిందితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి , భయపెట్టాలని చూశారు. అవినాష్ రెడ్డికి మందస్తు బెయిల్ తీర్పు కాపీలో సాక్షులను బెదిరించినట్లుగా ఫిర్యాదు లేదని పేర్కొనడం జరిగింది. సాక్షులను అవినాష్ రెడ్డి ప్రభావితం చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే బెయిల్ రద్దు చేయవచ్చని పేర్కొన్నారు. అయితే, వైఎస్ వివేక హత్య కేసు విచారణ ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ హైకోర్టుకు ఎందుకు మారిందన్నది పరిశీలించాలి. కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో డాక్టర్ వైఎస్ సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించగా, తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కేసును బదిలీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో సిబిఐ అధికారులను నిందితులు బెదిరించారు. సిబిఐ కార్యాలయానికి కరెంటు కట్ చేశారు. డ్రైవర్ ను బెదిరించారు. రామ్ సింగ్ పై కేసు నమోదు చేస్తే, ఎన్నో వాయిదాల అనంతరం ఆయనకు ఊరట లభించింది. విచారణ అధికారిపై కేసు నమోదు చేస్తే , సహజంగానే సాక్షులు బెదిరిపోతారు. ఆ లాజిక్ తీర్పులో మిస్సయింది. సాక్షాలను ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయవచ్చు. సాక్షాలను ధ్వంసం చేశారన్నదే అవినాష్ రెడ్డి పై సిబిఐ మోపిన ప్రధాన అభియోగం. హత్య ప్రదేశంలో రక్తపు మరకలను దగ్గర ఉండి అవినాష్ రెడ్డి తుడిపించారని
వైయస్ ప్రతాపరెడ్డి స్టేట్మెంట్లో చెప్పారు. సీఐ శంకరయ్య ఇచ్చిన వాంగ్మూలంలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు.

కేంద్రం అభ్యంతరం తెలిపినట్టే… తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తుందా?

తుది చార్జిషీటు దాఖలు చేయకపోవడం వల్ల
స్టాచ్యూరిటీ బెయిల్ పై ఉన్న నిందితుడిని ప్రతివాదులు అభ్యంతరం తెలియ చేయకపోవడం వల్ల ధర్మాసనం విడుదల చేసింది. అయితే ధర్మాసనం నిర్ణయం పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాన్ని తెలియజేసింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ లో
సోలిసిటర్ జనరల్ అప్పీల్ చేశారు. ఇదే తరహాలో దాదాపు 30 కేసులు హైకోర్టుల లో పెండింగులో ఉన్నాయని, ఆ కేసులపై ఈ తీర్పు ప్రభావం ఉన్నదన్నారు. వారికి బెయిల్ ఇచ్చేయ్యమంటారా ? అని సొలిసిటర్ జనరల్ ప్రశ్నించారు. ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును, త్రిసభ్య ధర్మాసనం సమీక్షించాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు వేసవి సెలవుల అనంతరం తీర్పును సమీక్షించనున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు . అయితే అప్పటివరకు హైకోర్టులు ఈ తీర్పును పరిగణలోకి తీసుకురాదని వెల్లడించారు. అలాగే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా హత్య కేసు నిందితులు ముందస్తు బెయిల్ అడిగే అవకాశం ఉంది. మెట్రోపాలిటన్, జిల్లా కోర్టులలో ముందస్తు బెయిల్ కోసం దాఖలయ్యే పిటిషన్ల పై హైకోర్టు తీర్పు ప్రభావం ఉండనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. హైకోర్టు తీర్పుపై, సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించి తీర్పు వెలువడే వరకు ఈ తీర్పు ప్రభావం కింది కోర్టులపై ఉండనుందన్నారు.

దమ్ముంటే పార్టీ నుంచి బహిష్కరించండి

గతంలో ప్రధానమంత్రికి రాసిన లేఖలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నన్ను రోగ్ అని సంబోధించారు. ముఖ్యమంత్రి వయసులో తనకంటే చిన్నవాడని అందుకే తెలిసి తెలియని తనంతో రోగ్ అని సంబోధించి ఉంటాడు. తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రోగ్ అని పేర్కొనడం పట్ల రఘురామకృష్ణంరాజు ఫైర్ అయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి తనకంటే వయసులో పెద్దవాడు. ఆయన బుద్ధి ఏమయ్యింది. నేను రోగ్ అయితే మీ పార్టీలో ఎందుకు ఉంచుకున్నారు. మీకు సిగ్గు లేదా?. పార్టీలో ఉంచుకుంటే గౌరవించండి. లేకపోతే పార్టీ నుంచి బహిష్కరించండి. అంతేకానీ పార్టీలో ఉంచుకొని అగౌరవ పరుస్తాము అంటే నేను అంతకు పదింతలు అగౌరవపరచగలను తస్మాత్ జాగ్రత్త అంటూ రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు.