NRI-NRT

జపాన్ లో జనాభా సంక్షోభం….

జపాన్ లో జనాభా సంక్షోభం….

జననాల రేటు 2022 సంవత్సరంలో వరుసగా ఏడో సంవత్సరం కూడా తగ్గింది. ఈవిషయాన్నిజపాన్ ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఓ వైపు జనాభా తగ్గిపోతుండటం.. మరోవైపు వృద్ధుల జనాభా పెరుగుతుండటం జపాన్ ప్రభుత్వాన్ని ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఇది భవిష్యత్ లో మానవ వనరుల సంక్షోభానికి.. ఫలితంగా ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుందేమోననే ఆందోళనలో అక్కడి సర్కారు ఉంది. జపాన్ లో ఒక స్త్రీకి జీవిత కాలంలో జన్మిస్తున్న పిల్లల సగటు సంఖ్య(సంతానోత్పత్తి రేటు) ప్రస్తుతం 1.25గా ఉంది. అంటే.. ఒక స్త్రీ సగటున ఒకరికి మాత్రమే జన్మనిస్తోంది. చివరగా 2005 సంవత్సరంలోనూ జపాన్ లో సంతానోత్పత్తి రేటు 1.26గా ఉంది.

గత ఏడేళ్లుగా ఇదే రేంజ్ లో సంతానోత్పత్తి రేటు ఉండటాన్ని బట్టి.. అక్కడ జనాభా పెరుగుదల ఎంత తక్కువగా(Japan Population Down) ఉందో అర్థం చేసుకోవచ్చు. జపాన్ లో కనీసం ప్రస్తుతం ఉన్న జనాభా సంఖ్య(12.57 కోట్ల మంది) అయినా ఫ్యూచర్ లో తగ్గకుండా ఉండాలంటే సంతానోత్పత్తి రేటు కనీసం 2.07 దరిదాపుల్లో ఉండాలి. ప్రస్తుత పరిస్థితే ఇంకా కొనసాగితే.. జపాన్ లో యువత జనాభా 2030 నుంచి బాగా తగ్గడం ప్రారంభమవుతుందనేది ఒక విశ్లేషణ. ఈనేపథ్యంలో జపాన్ ప్రభుత్వం పిల్లల సంరక్షణ, తల్లిదండ్రులకు మద్దతు అందించే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఏటా లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ ఏడాది నుంచి ఇందుకోసం ప్రతి సంవత్సరం రూ.2 లక్షల కోట్లను ఖర్చు చేయాలని జపాన్ సర్కారు ప్లాన్ చేస్తోంది.