DailyDose

TNI తాజా వార్తలు…

TNI తాజా వార్తలు…

తెలంగాణలో నిప్పులు కురిపిస్తున్న భానుడు..

తెలంగాణలో భానుడు మండిపోతున్నాడు. జనంపై నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ నిన్న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 13 జిల్లాల్లోని 47 మండలాల్లో వీచిన వడగాలులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6.5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. పది మండలాల్లో 45-46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

నేడు 4 గంటలు ఆలస్యంగా వందేభారత్

విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెంబర్ 20833) నేడు 4 గంటలు ఆలస్యంగా బయలుదేరనుంది. రోజూ ఉ.5.45కే బయలుదేరాల్సి ఉండగా.. ఈరోజు మాత్రం 9.45కు విశాఖ నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతుందని అధికారులు ప్రకటించారు. సాయంత్రం 5.45కు సికింద్రాబాద్ స్టేషను చేరుకోనుంది.

మరో మూడునాలుగు రోజుల్లో ఏపీకి రుతుపవనాలు…

మరో మూడునాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను తాకనున్నాయి. ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు చురుగ్గా కదులుతూ కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దేశంలోని మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. మరో మూడు నాలుగు రోజుల్లో అనంతపురం మీదుగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలను ఇవి తాకుతాయని పేర్కొంది.

శ్రీకాళహస్తిలో నేడు జేపీ నడ్డా బహిరంగ సభ…

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవ్వాల శ్రీకాళహస్తిలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోమ వీర్రాజు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అలాగే ఏపీకి అందించిన సహాయాన్ని ఈ సందర్భంగా జేపీ నడ్డా ఏపీ ప్రజలకు వివరించనున్నారు. ఇక రేపు విశాఖలో అమిత్ షా బహిరంగ సభ జరగనుండగా ఆ తర్వాత రాజమహేంద్రవరంలో మురళీధరన్ గారి సమావేశం కూడా ఉండనుంది.

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

AP: వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి ఏటీసీ వరకు భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 గంటల టైం పడుతోంది. నిన్న శ్రీవారిని 74,502 మంది దర్శించుకున్నారు. 38,052 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చింది.

నేడు సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి….

నేడు ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరు కావాలని వారం రోజుల క్రితం హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. ముందస్తు బెయిల్ పొందిన తర్వాత ఆయన విచారణకు హాజరుకావడం ఇది రెండోసారి. ఈ నెల 3న అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించింది.

నేడు బాలకృష్ణ బర్త్‌డే…

నటసింహం నందమూరి బాలకృష్ణ నేడు 63వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆదిత్య 369, బంగారు బుల్లోడు, భైరవ ద్వీపం, బొబ్బిలి సింహం, సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు, శ్రీరామరాజ్యం, లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి, అఖండ లాంటి మాస్, పౌరాణిక చిత్రాలతో అలరించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగానూ గెలిచారు. సినిమాలు, రాజకీయాలతో పాటు బసవతారకం ఆస్పత్రిలో పేదలకు క్యాన్సర్ చికిత్స అందిస్తున్నారు.

తెలంగాణ పోలీసు శాఖలో భారీ ప్రమోషన్లు..

18 మంది అడిషనల్ ఎస్పీలను ఎస్పీలుగా, 37 మంది డీఎస్పీలను ఏఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులకు సంబంధించిన జీవో నిన్న రాత్రి విడుదలయింది. పదోన్నతి పొందిన అధికారులంతా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రమోషన్ పొందిన అధికారుల్లో నర్మద, పుష్ప కర్రి, శృతకీర్తి చేపూరి, కవిత గంజి, సునీత మోహన్, శ్రీనివాస్ మలినేని, కోట్ల నర్సింహారెడ్డి, శ్రీనివాసరావు, రవి కుమార్, వెంకటరావు, ప్రసన్న రాణి, చంద్రమోహన్, ఉష తిరునగరి తదితరులు ఉన్నారు. మరోవైపు పోలీసు అధికారులకు ప్రమోషన్ కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ అంజనీ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. పదోన్నతి పొందిన అధికారులకు అభినందనలు తెలిపారు.

నేడు రాష్ట్రవ్యాప్తంగా సుపరిపాలన ఉత్సవాలు..

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సుపరిపాలన దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు వివిధ శాఖలను పునర్‌ వ్యవస్థీకరణ చేయడం వల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతున్న విషయాన్ని వారికి వివరించాలని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

* జులై 1 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం…

పవిత్ర అమర్‌నాథ్‌ యాత్ర ను జూలై 1 నుంచి ప్రారంభించనున్నారు. యాత్ర ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో 3,880 మీటర్ల ఎత్తున కొలువుదీరిన మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు శివ భక్తులతోపాటు సాధారణ భక్తులు రానున్నారు.