WorldWonders

ఇలాంటి ప్రమాదం నుంచి తప్పించుకున్న మొదటి వ్యక్తి

ఇలాంటి ప్రమాదం నుంచి తప్పించుకున్న మొదటి వ్యక్తి

ఒక్కసారిగా మెరుపు మెరిసి, పిడుగు మీద పడిందంటే బతికి బయటపడటం కష్టం. కానీ ఒక చైనీస్ వ్యక్తి విషయంలో మాత్రం ఇది రివర్స్ అయింది. కేవలం ఐదు నిమిషాలకంటే తక్కువ వ్యవధిలో రెండుసార్లు పిడుగుపాటుకు గురైనప్పటికీ.. అతను జీవించి ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పలువురు ఆ వ్యక్తిని అదృష్ట జాతకుడని పొగిడేస్తున్నారు. చైనా దేశంలోని, గుయిజౌ ప్రావిన్స్‌లో గల జునీ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గత నెలలో లియు నాన్ అనే వ్యక్తి తన ఇంటి ముందు నిల్చున్న సమయంలో.. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మెరుపు మెరవడంతో అతను వెంటనే కిందపడిపోయాడు. ఆ క్షణంలో కళ్లు బైర్లు కమ్మడంతో ఏం జరిగిందో కూడా తెలియదట.కాసేపయ్యాక స్పృహలోకి వచ్చిన లియూ పైకి లేవబోతుండగానే మళ్లీ పెద్ద శబ్దంతో మెరుపు మెరిసి పిడుగు పడింది. మరోసారి స్పృహ తప్పి పడిపోయాడు. అంతకు ముందు అతనిని ఎవరూ గమనించలేదు. కానీ రెండవసారి చూసిన భార్య, పిల్లలు భయంతో ఏడ్వడం ప్రారంభించారు. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే మధ్య వయస్కుడైన ఆ వ్యక్తి పాదాలు, నడుము, వీపు భాగంలో తీవ్రంగా కాలిన గాయాలు కనిపించాయి. టెస్టులు నిర్వహించిన డాక్టర్లు అతను రెండుసార్లు పిడుగుపాటుకు గురయ్యాడని నిర్ధారించారు. వాస్తవానికి ఒక వ్యక్తి తన జీవితకాలంలో పిడుగుపాటుకు గురయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఒక అంచనా ప్రకారం 15,300 మందిలో ఒకరు ఒక్కసారి మాత్రమే పిడుగుపాటుకు గురవుతుంటారు. ఒకే స్థలంలో రెండుసార్లు పిడుగు పడదని కూడా చెప్తుంటారు. కానీ చైనాలోని జునీలో మాత్రం ఇది జరిగింది. ఇలా జరగడం ప్రపంచంలోనే మొదటిసారి కాబట్టి అందరూ లియూ గురించిన సమాచారం తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.