NRI-NRT

భారత విద్యార్థుల దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న కెనడా

భారత విద్యార్థుల దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న కెనడా

వివిధ దేశాల విద్యార్థులు కెనడాకు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది భారతీయులకు ఇప్పటివరకూ 96175 స్టూడెంట్ వీసాలు జారీ అయ్యాయి. గతేడాది ఏడాది భారతీయులకు ఏకంగా 226,000 వీసాలు జారీ కాగా ఈ సంవత్సరం కూడా అదే జోరు కొనసాగుతోంది. మరోవైపు, అక్రమ డాక్యుమెంట్లతో కెనడాలో కాలుపెట్టిన వారిని అక్కడి ప్రభుత్వం వెనక్కు పంపించేందుకు సిద్ధమైన ఉదంతాలు కూడా పలు వెలుగు చూశాయి.

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వీసా పథకాన్ని కెనడా ప్రభుత్వం సమీక్షిస్తోంది. కన్సల్టెంట్ల చేతుల్లో విద్యార్థులు మోసపోకుండా ఉండేలా పథకాన్ని సమీక్షిస్తోంది. ఈ విషయమై భారత్‌లోని కెనడా హైకమిషన్ భారతీయ విద్యార్థులకు పలు సూచనలు చేసింది. స్టడీ పర్మిట్ విధానంపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించింది. బయోమెట్రిక్ ఎన్‌రోల్‌మెంట్ తరువాత దరఖాస్తు పరిశీలనకు ఎంత సమయం పడుతుందనేది కెనడా ఇమిగ్రేషన్ వెబ్‌సైట్ సందర్శించి అవగాహన పెంచుకోవాలని సూచించింది.స్టూడెంట్ పర్మీట్లకు దరఖాస్తు చేసే సమయంలో కచ్చితమైన వివరాలు తెలియజేయాలని హైకమిషన్ స్పష్టం చేసింది. వీసా దరఖాస్తుకు విద్యార్థికి సాయపడుతున్న వీసా కన్సల్టెన్సీల వివరాలు కూడా తెలియజేయాలని పేర్కొంది. కన్సల్టె్న్సీల విషయంలో కచ్చితమైన వివరాలు ఇవ్వని పక్షంలో అయిదేళ్ల పాటు వీసా దరఖాస్తు చేసుకోకుండా నిషేధం విధించే అవకాశం ఉందని కూడా హైకమిషన్ హెచ్చరించింది.