Politics

చంద్రబాబు హయాంలో ఒక్క మంచి పథకం అయినా తీసుకొచ్చారా: జగన్‌

చంద్రబాబు హయాంలో ఒక్క మంచి పథకం అయినా తీసుకొచ్చారా: జగన్‌

సొంత కొడుకుపై నమ్మకం లేక దత్త పుత్రుడికి ప్యాకేజ్‌ ఇచ్చారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబు రాజకీయ చరిత్ర మొత్తం వెన్నుపోట్లు, మోసం, అబద్ధాలేనని మండిపడ్డారు. గొడవలు సృష్టించి శవరాజకీయాలు చేసేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. ఎల్లో మీడియా ద్వారా అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నగరిలో బటన్‌ నొక్కి ‘విద్యాదీవెన’ నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు. ఏప్రిల్‌–జూన్‌ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యా­ర్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందించారు. బటన్‌ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లపై విరుచుకుపడ్డారు.

దొంగ ఓట్లను తొలగిస్తుంటే దుష్ప్రచారం
ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వ్యక్తి చంద్రబాబు అని ముఖ్యమంత్రి విమర్శించారు. అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తాడని, పిల్లనిచ్చిన మామను కూడా వెన్నుపోటు పొడిచాడని ప్రస్తావించారు. చంద్రబాబు ప్రతి అడుగు కుట్రలు, కుతంత్రాలేనని మండిపడ్డారు. పుంగనూరులో అల్లర్లు సృష్టించి పోలీసులపై దాడి చేశారని దుయ్యబట్టారు. ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పగలిగే వ్యక్తి ఎవరూ లేరని అన్నారు. రాష్ట్రంలో దొంగ ఓట్లను తొలగిస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలకు బాబు నరకం చూపించారు
అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని సీఎం జగన్‌ మండిపడ్డారు. ఎన్నికలయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారని.. ప్రజలకు నరకం చూపించారని అన్నారు. అప్పట్లో పాలన దోచుకో, పంచుకో తినుకో అన్న విధంగా ఉండేదని విమర్శించారు. మూడుసార్లు సీఎం అయిన చంద్రబాబు ఒక్క మంచి పథకమైనా తెచ్చారా? అని ప్రశ్నించారు.