Politics

ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేసిన ద్రౌపది ముర్ము

ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేసిన ద్రౌపది ముర్ము

దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్రం ముద్రించిన రూ. 100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో ఈ సార్మక నాణేం విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. భారత సినీ రంగం అభివృద్దిలో ఎన్టీఆర్ పాత్ర కీలకం అని అన్నారు. రాముడి, కృష్ణుడి రూపాలను ప్రజలు ఆయనలో చూసుకున్నారని చెప్పారు. రాముడి, కృష్ణుడి వంటి పాత్రల్లో ఎన్టీఆర్ నటన అద్భుతం అని పేర్కొన్నారు. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ తన ప్రత్యేకత చాటుకున్నారని అన్నారు. సామాజిక న్యాయం కోసం ఎంతగానో కృషి చేశారని చెప్పారు.

అంతకుముందు, ఎన్టీఆర్ కుమార్తె, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. ఇది ఎన్టీఆర్‌కు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టుగా చెప్పారు. ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఉండరని అన్నారు. ప్రజలపై సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందని అన్నారు. విభిన్న పాత్రల ద్వారా ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో నిలిచారని చెప్పారు. ప్రజా సేవ కోసం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. మహిళలకు ఆస్తిలో హక్కు ఉండాలని ఎన్టీఆర్ చెప్పారని గుర్తుచేశారు. తిరుపతిలో మహిళా వర్సిటీ ఏర్పాటు చేశారని చెప్పారు. ఎన్టీఆర్ ఒక తరం హీరో కాదని.. అన్ని తరాలకు ఆదర్శ హీరో అని అన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ తనదైన ముద్రవేశారని తెలిపారు.

ఇక, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రూ. 100 స్మారక నాణేన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కుమార్తె, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, ఎన్టీఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన 20 నిమిషాల నిడివి గల వీడియో ప్రదర్శన ఇస్తారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ముద్రించిన రూ. 100 స్మారక నాణాన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో నాణెం తయారు చేశారు. హైదరాబాద్ మింట్ కాంపౌడ్‌లో ఈ నాణేన్ని తయారు చేశారు.