Politics

పవన్ చంద్రబాబుకు కూడా విద్య కానుకగా ఇవ్వాలని రోజా సెటైర్లు

పవన్ చంద్రబాబుకు కూడా విద్య కానుకగా ఇవ్వాలని రోజా సెటైర్లు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో పర్యటిస్తున్నారు. జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా ఏప్రిల్‌–జూన్‌ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యా­ర్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సీఎం జగన్‌ విడుదల చేయనున్నారు. బటన్‌ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేయనున్నారు.

ఈ సందర్బంగా వేదికపై మంత్రి, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవిలో తొలిసారి నగరికి వచ్చేసిన ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. నగరి నియోజకవర్గానికి సీఎం జగన్‌ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాణ్యమైన విద్యను పేదవాడి ఆస్తిగా మార్చిన ఘనత సీఎం జగన్‌దేనని కొనియాడారు. చదువుకు కుల, మత, ప్రాంత బేధాలు చూడకుండా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్నారని ప్రశంసించారు.

సాక్ష్యాత్తు ప్రధానే ప్రశంసించారు
విద్యారంగంలో దేశానికే ఏపీ అదర్శంగా నిలుస్తోందని రోజా పేర్కొన్నారు. సీఎం జగన్‌ వల్లే అన్ని వర్గాలకు విద్య చేరువైందని.. ​కొర్పోరేట్‌ స్కూళ్లకు ప్రభుత్వ స్కూళ్లు పోటీనిస్తున్నాయని తెలిపారు. విద్యా దీవెన, వసతి పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకు రాలేదని తెలిపారు. ఇంత గొప్ప ఆలోచన ఎవరికీ కూడా రాలేదన్నారు. విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని.. ఏపీలో విద్యారంగాన్ని సాక్ష్యాత్తు ప్రధానే ప్రశంసించారని ప్రస్తావించారు.

బాబు, పవన్‌కు మంచి చదువులు చెప్పించాలి
ఇంటర్‌లో తాను ఏ గ్రూప్‌ చదివాడో కూడా పన్‌కు తెలియదని మంత్రి రోజా విమర్శించారు. బైపీసీ చదివితే ఇంజనీర్‌ అవ్వొచ్చని చంద్రబాబు అంటారని.. పవన్‌, చంద్రబాబులకు కూడా విద్యాకానుక ఇవ్వాలని అన్నారు. విద్యాదీవెనతో బాబు, పవన్‌కు మంచి చదువు చెప్పించాలని సెటైర్లు వేశారు.. టీడీపీని నమ్ముకుంటే యువత జైలుకు వెళ్తారు. పవన్‌ను నమ్ముకుంటే యువత రిలీజ్‌ సినిమాలకు వెళ్తారన్న ఆమె… అదే సీఎం జగన్‌ను నమ్ముకుంటే మంచి కాలేజీలు, వర్సిటీలకు వెళ్తారని పేర్కొన్నారు.

2024 వైఎస్‌ జగన్‌ వన్స్‌మోర్‌
వైఎస్‌ జగన్‌ను ఓడించేవాడు ఇంకా పుట్టలేదని రోజా అన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని వాడు వైఎస్‌ జగన్‌ను ఎలా ఓడిస్తాడని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 175 సీట్లు ఇచ్చి దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కుప్పంలో ప్రతి ఇంటికి సంక్షేమం ఇచ్చిన ఘనత జగన్‌ది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమని పేర్కొన్నారు.

‘ఆటో డ్రైవర్‌ కూతురు ఆటో మొబైల్‌ ఇంజనీరింగ్‌ చేస్తోంది. రైతు బిడ్డ వ్యవసాయ శాస్త్రవేత్త చదువుతున్నాడు.ఒక మెకానిక్‌ కొడుకు మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేస్తున్నాడు. కంపౌండర్‌ కూతురు డాక్టర్‌ చదువుతున్నాడంటే అది ముమ్మాటికీ సీఎం జగన్‌ వల్లే. అన్న పార్టీలో ఒక సైనికురాలిగా ఉన్న గర్వపడుతున్నాం. అన్నదానం ఆకలి తీర్చితే అక్షర దానం అజ్ఞానాన్ని తొలగిస్తుందంటారు. ఆకలి తీర్చాలన్నా, అజ్ఞానాన్ని తొలగించాలన్నా పేదరిక నిర్మూలన జరగాలన్న అది విద్యతోనే సాధ్యమని మనస్పూర్తిగా నమ్మారు కాబట్టే ప్రతి పేద వాడి బిడ్డను గొప్ప చదువులు చదివేందుకు సీఎం జగన్‌ అండగా నిలిచారు’ అని రోజా పేర్కొన్నారు.