నగరంలోని పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం పేరుతో నవ వధువుపై బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన యువతికి 3 నెలల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఆరోగ్యం బాగాలేదని బండ్లగూడలోని ఓ బాబా వద్దకు అత్తమామలు తీసుకెళ్లారు. నవ వధువు కళ్లకు బాబా గంతలు కట్టి గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు తెలియడంతో అతడు పరారయ్యాడు. దీనిపై అత్తమామలకు చెప్పినా వారు పట్టించుకోలేదని యువతి ఆరోపించింది. దెయ్యం పట్టిందంటూ యువతిని వారు ఇంట్లోనే బంధించారు.
ఆ తర్వాత తల్లిదండ్రుల సాయంతో భవానీనగర్ పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. ఘటన బండ్లగూడ పరిధిలో జరిగిందంటూ భవానీనగర్ పోలీసులు వారిని అక్కడికే పంపించారు. పోలీసులు కూడా తనకు న్యాయం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.