రక్షాబంధన్ పండుగ సందర్భంగా భాగ్యనగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలో ప్రధాన బస్ స్టేషన్లు అయిన జేబీఎస్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్లు, ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోయింది. మరోపక్క సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో సందడిగా మారిపోయాయి.రక్షాబంధన్ పండుగ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ఈ నెల 29, 30, 31వ తేదీల్లో మూడు వేల ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. ఈ మూడు రోజుల్లో ప్రతిరోజూ వెయ్యి బస్సులను నడిపించేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. వీటితో పాటు ఈనెల 30, 31 తేదీల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళలకు లక్కీ డ్రా ద్వారా రూ.5.50 లక్షల విలువగల బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని ఆర్టీసీ కల్పించింది. అయితే, బస్సుల సంఖ్య పెంచినప్పటికీ.. తమకు సరిపడా బస్సులు అందుబాటులో లేవని ప్రయాణికులు వాపోతున్నారు. ఒక్కో బస్సు కోసం సుమారు గంట నుంచి రెండు గంటల వరకు వేచి చూడాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.