DailyDose

మోదీకి రాఖీ కట్టిన స్కూల్ పిల్లలు-TNI నేటి తాజా వార్తలు

మోదీకి రాఖీ కట్టిన స్కూల్ పిల్లలు-TNI నేటి తాజా వార్తలు

మోదీకి రాఖీ కట్టిన స్కూల్ పిల్లలు

స్కూల్‌ విద్యార్థినులతో కలిసి ప్రధాని నరేంద్రమోదీ రక్షా బంధన్‌  వేడుకను చేసుకున్నారు. దిల్లీ పాఠశాలల విద్యార్థులు బుధవారం ఉదయం ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. అనంతరం మోదీ వారితో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ తమ అధికారిక ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో పంచుకుంది. అంతకుముందు, రాఖీ పండుగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘రక్షాబంధన్‌ ఒక పవిత్రమైన పండుగ. మన దేశ సంస్కృతికి ప్రతిరూపం. ఈ పండుగ ప్రజల జీవితాల్లో బంధాలు, ఆప్యాయత, సామరస్య భావాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ పోస్టు చేశారు.

తితిదే ధర్మకర్తల మండలి సభ్యులుగా ఆరుగురి ప్రమాణ స్వీకారం

తితిదే ధర్మకర్తల మండలి సభ్యులుగా బుధవారం ఆరుగురు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్ ఎక్స్అఫీషియో సభ్యుడిగా, వై.సీతారామిరెడ్డి, బాలసుబ్రమణియన్ పళనిస్వామి, ఆర్.వెంకటసుబ్బారెడ్డి, సిద్దవటం యానాదయ్య, సిద్ధా వీరవెంకట సుధీర్ కుమార్ ధర్మకర్తల మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

కేసీఆర్‌పై జూపల్లి ఫైర్

మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నవారిని.. అమ్ముడుపోయిన నేతలను తరిమికొడదామని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల్యను సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు కొనుగోలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకొన్ని రోజుల్లో సీఎం కేసీఆర్ గద్దె దిగుతాడని.. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జూపల్లి దీమా వ్యక్తం చేశారు.

సెప్టెంబర్ 2 తర్వాత భారీ వర్షాలకు ఛాన్స్

తెలంగాణలో గత కొన్ని రోజులుగా వరుణుడి జాడ లేకుండా పోయింది. ఈసారి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైంది. జూన్ నెలలో వర్షాలు సరిగా కురవలేదు. దీంతో ఆ నెల లోటు వర్షపాతం నమోదైంది. ఇక జూలై చివరి వారంలో వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని నదులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వరదల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. జూలై నెలలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇక ఆగస్టు వచ్చేసరికి సీన్ పూర్తిగా మారిపోయింది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. వేడి గాలులు దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు లేక అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు.1972 ఆగస్టు తర్వాత తెలంగాణలో అత్యల్ప వర్షపాతం ఈ ఏడాది ఆగస్టులో నమోదైందని అధికారులు వెల్లడించారు. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) గణాంకాల ప్రకారం ఆగస్టులో రాష్ట్రంలో సగటు వర్షపాతం 74.4 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. 1972లో 83.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఆగస్టులో 74.4 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది.

ఎంబీబీఎస్ ప్రవేశాలకు రెండవ విడత కౌన్సిలింగ్ నోటిఫికేషన్

ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ ప్రవేశాలకు రెండవ విడత కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ను కాళోజి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. మొదటి విడత అనంతరం ఖాళీగా ఉన్న సీట్ల ను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కళాశాల వారిగా సీట్ల ఖాళీల వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచారు.ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల తేదీ 1వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ www.knruhs.telangana.gov.in లో చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

కాంగ్రెస్ లోకి మరో మాజీ ఎమ్మెల్యే

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే బీఆర్ఎస్ 115 మందితో తొలి జాబితా ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆశావహ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది.నిన్నటి నుంచి అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికలో కీలక ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చేందుకు సిద్దం అయ్యారు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్ రెడ్డి. తాజాగా రేవంత్ రెడ్డిని కలిసిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటన కూడా చేశారు. ఇక అటు బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ తనయుడు డాక్టర్ వికాస్ రావు, బీఆర్ఎస్ నేత కృష్ణ యాదవ్ బీజేపీలో చేరనున్నారు.

*  BRS సర్కార్‌కు మరో షాక్

దళితులను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్షంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా అర్హత గల వారికి ప్రభుత్వం రూ. 10 లక్షల ఆర్థిక సహయం చేస్తోంది. ఈ స్కీమ్‌లో లబ్దిదారుల ఎంపికను సర్కార్ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు అప్పగించింది. అయితే, దళిత బంధు స్కీమ్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.లబ్ధిదారుల ఎంపికలో ప్రజా ప్రతినిధుల జోక్యం చట్ట విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. దళిత బంధు స్కీమ్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ప్రజాప్రతినిధుల ప్రమేయం తొలగించాలని పిటిషనర్ కోరారు. ఈ లిస్ట్‌లో ఎమ్మెల్యేల అనుచరులకే ఈ పథకం వర్తింపజేస్తున్నారని.. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

*  శ్రీకాకుళంలో షాపింగ్ మాల్‌లో మంటలు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని స్నేహ షాపింగ్ మాల్‌లో మంటలు చెలరేగడంతో షాపులోని వస్తువులు మంటల్లో దగ్ధమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దింగింది. నాలుగు ఫైర్‌ ఇంజిన్‌లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ప్రాథమిక విచారణ ప్రకారం, అగ్నిప్రమాదం వల్ల ఆస్తి నష్టం వాటిల్లిందని, రూ. 6 కోట్లు కాగా, ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు తేల్చారు. ఖచ్చితమైన కారణాన్ని దర్యాప్తు తరువాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని అధికారులు షాపింగ్‌ మాల్స్‌ యజమానులకు సూచించారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నిరోధించడానికి ఫైర్ సేఫ్టీ ప్రోటోకాల్స్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ సాధారణ నిర్వహణ చాలా కీలకమని వారు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. నిన్న కర్ణాటక లోని హవేరీ జిల్లాలోని అలదకట్టి గ్రామంలో బాణాసంచా దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించి ముగ్గురు సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బందితో కలిసి , పోలీస్‌లు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. ప్రమాదంపై పోలీస్‌లు దర్యాప్తు చేస్తున్నారు.

సెకండ్‌ డిగ్రీగా ఎంబీఏలో అడ్మిషన్లు

ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఎస్సీ, ఎంసీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు జేఎన్టీయూ మరో అవకాశం కల్పించింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సులు చదువుతున్న వారు సెకండ్‌ డిగ్రీ కోర్సుగా ఎంబీఏను ఎంపిక చేసుకొనే సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎంబీఏ ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.ఎంబీఏలో డాటా సైన్స్‌, ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌ అండ్‌ అనాలిసిస్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ ఎకనామిక్స్‌, లీగల్‌ అండ్‌ బిజినెస్‌ ఎన్విరాన్‌మెంట్‌, హ్యుమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌, మేనేజ్‌మెంట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ వంటి ప్రత్యేక సబ్జెక్టులలో అడ్మిషన్‌ పొందే అవకాశం కల్పించనున్నారు. మూడేండ్ల కాల పరిమితి ఉన్న ఈ కోర్సులో ప్రవేశాలకు సెప్టెంబర్‌ 30 వరకు అవకాశం కల్పించారు. ఫీజు చెల్లించడానికి అక్టోబర్‌ 30 తుది గడువుగా విధించారు. వివరాలకు ఎంబీఏ కాలేజీ ప్రిన్సిపాల్‌ లేదా 9154251963 సంప్రదించాలని వర్సిటీ అధికారులు సూచించారు.

బాలకృష్ణ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌

బాలకృష్ణ  కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌లలో ఒకటిగా నిలిచిన చిత్రం ‘భైరవద్వీపం’ . ఈ సినిమా రీ రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ రీ రిలీజ్‌ను మరోసారి వాయిదా వేస్తున్నట్లు క్లాప్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రాన్ని మొదట ఆగస్టు 5న రీ రిలీజ్‌ చేయాలని భావించారు. కానీ, కొన్ని కారణాల వల్ల దాన్ని ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేశారు. అయితే, బుధవారం కూడా దాన్ని విడుదల చేయలేదు. దీంతో అందుకు గల కారణాన్ని వివరిస్తూ నిర్మాతలు ఓ నోట్‌ను విడుదల చేశారు. ‘‘భైరవద్వీపం’ సినిమాకు ఆధునిక హంగులు అద్ది 4కె రిజల్యూషన్‌తో మీ అందరికీ అందించాలని ఎంతో ప్రయత్నించాం. కానీ, ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు 4కెలోకి మారలేదు. దీంతో ఈ రీ రిలీజ్‌ను మరోసారి వాయిదా వేయాల్సి వస్తోంది. మంచి అవుట్‌పుట్‌ కోసం ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తాం’’ అని ఆ నోట్‌లో పేర్కొన్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ జానపద చిత్రంలో రోజా హీరోయిన్‌గా నటించారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్‌ కేసరి’లో నటిస్తున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్‌ 19న విడుదల కానుంది.