Business

నేడు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేడు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock Market) సెప్టెంబరు నెల తొలిరోజే అదరగొట్టాయి. రెండు ప్రధాన సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు సూచీలకు దన్నుగా నిలిచాయి. దేశీయంగా జీఎస్‌టీ వసూళ్లలో పెరుగుదల, ఆటో విక్రయాలు సూచీల్లో ఉత్సాహం నింపాయి.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 64,855.51 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 65,473.27- 64,818.37 మధ్య కదలాడింది. చివరకు 555.75 పాయింట్ల లాభంతో 65,387.16 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 19,258.15 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 19,458.55- 19,255.70 మధ్య ట్రేడైంది. చివరకు 181.50 పాయింట్లు లాభపడి 19,435.30 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.71 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, నెస్లే ఇండియా, ఎల్‌అండ్‌టీ, సన్‌ఫార్మా మినహా మిగిలిన షేర్లన్నీ లాభాల్లో ముగిశాయి. ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మారుతీ, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, విప్రో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌ అత్యధికంగా లాభపడిన వాటిలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..
* మారుతీ సుజుకీ షేరు ఇంట్రాడేలో రూ.10,397.95 దగ్గర 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. ఆగస్టు నెలలో కంపెనీ విక్రయాలు ఆల్‌టైం గరిష్ఠానికి చేరాయి. చివరకు సంస్థ షేరు 3.16 శాతం పెరిగి రూ.10,320 వద్ద స్థిరపడింది.

* గ్రీన్‌ హైడ్రోజన్ సహా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి రంగంలో ఉన్న అవకాశాలను అన్వేషించడం కోసం ప్రభుత్వం రంగ సంస్థలు ఎన్‌టీపీసీ, ఆయిల్‌ ఇండియా ఒప్పందాన్ని కదుర్చుకున్నాయి. ఎన్‌టీపీసీ షేరు ఈరోజు 5.02 శాతం పెరిగి రూ.231.35 వద్ద, ఆయిల్‌ ఇండియా షేరు రూ.273.40 వద్ద ముగిసింది.

* ఆగస్టులో ఎన్‌ఎండీసీ ఇనుప ఖనిజం ఉత్పత్తి 37.5 శాతం పెరిగి 3.41 మిలియన్‌ టన్నులకు చేరింది. విక్రయాలు సైతం 25 శాతం పెరిగి 3.57 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యాయి. సంస్థ షేరు చివరకు 6.18 శాతం లాభపడి రూ.130.65 దగ్గర స్థిరపడింది.

* వేదాంతపై ఓసీసీఆర్‌పీ పలు ఆరోపణలు చేసినప్పటికీ.. షేరు ఈరోజు ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. చివరకు 1.59 శాతం లాభంతో రూ.236 వద్ద స్థిరపడింది.

* ఓసీసీఆర్‌పీ చేసిన ఆరోపణల నేపథ్యంలో గురువారం కుదేలైన అదానీ గ్రూప్‌ షేర్లు ఈరోజు పుంజుకున్నాయి. అదానీ విల్మర్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌ మినహా మిగిలిన షేర్లన్నీ లాభాలు నమోదు చేశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 1.33 శాతం లాభపడి రూ.2,451 దగ్గర స్థిరపడింది.